నాది నాదే. నీది కూడా నాదే అనే స్వార్థ ప్రపంచంలో …
'' నాది
నీదైనప్పుడునిజంగా నేను మనిషినవుతాను.'' అని చెప్పగల త్యాగనిరతి ఎంత మందిలో ఉంటుంది. ఈ కవి అలాంటివాడే. కాబట్టే…
'' నాకు నచ్చని
నా ని పుచ్చుకొని నడువలేను” అని
ప్రకటిస్తాడు.
మన
పేరు కోసం, మనమెన్ని
ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్ని
పడవాట్లు పడతాం. కవి ఇతరులలో తనను చూసుకొని మురిసిపోవడం కవిదెంత విశాలహృదయం!
కవిత్వం కళ్ళ జోడుతో లోకాన్ని చూసే కవికి కనిపించినంత స్పష్టంగా ప్రపంచం
మరెవరికి కనిపించదు.
ఈ కవికి శబ్దాలంకారాల మీద మమకార మెక్కువ.
యతి మైత్రిలు ,
ప్రాసల లాగా చాలానే కనిపిస్తాయి.
చూడండి...
'' జగతి
ముందు యువతని '',
''పంచుకున్న ప్రేమల్లో ఎంచుకున్న చదువుల్లో''
''తలపుల తనువులను తడమాలని లేదు.''
''తిరిగిరాని తీరాలకు తరలి పోవాలని'' ఇట్లాంటి వృత్త్యానుప్రాసాలంకార వాక్యాలు
ఇందులో కొల్లలుకొల్లలుగా కనిపిస్తాయి.
ఇంకా ఈ కవి శబ్ధవిన్యాసాలు చూడండి...
"నీ
మునివేళ్ళను ముని మాపు వేళ్ళల్లో"
"నిను
వారించాలని, వరించాలని"
"ఆడి ఆడి వాడేలోగా"
" తడుముతోంది..తరుముతోంది"
ఇలా శబ్ధాల మీద తన మమకారాన్ని చాటుకుంటాడు కవి.
శ్రీశ్రీలా తిరిగేసి మరిగేసి చెప్పడం ఈ కవికీ చేతనవును
చూడండీ...
''నువ్ తుర్రుమన్నప్పుడు
నే కేర్ మన్ననో!
నే కేర్ మన్నప్పుడు
నువ్ తుర్రు మన్నావో!" అంటాడు.
కవితలకు
నేపథ్యాలు చూపడం ఇబ్బందికరమే. పాఠకుడి యొక్క ఊహా శక్తిని పరిమితం చేయడమే. కానీ
ఒక్కోసారి మేలు కూడా జరుగుతుందండోయ్! కవి కవితను పాఠకుడు అర్థం చేసుకోకపోయినా
పర్వాలేదు. కానీ అపార్థం చేసుకోకూడదు. అలా జరుగకుండ ఉండాలంటే, కవి దృష్టి
కోణంలో కవితను చూడాలంటే నేపథ్యాలు అవసరమే. అందుకే ఈ కవి తన పుస్తకంలో చాలా వాటికీ
నేపథ్యాలను చూపించాడు. ఇది సమంజసమే.
ఈ పుస్తకంలోని అద్భుత కవిత 'బొమ్మరాళ్ళు ' అమ్మల
ఆవేదనకు, నిర్వేదానికి, అచేతనానికీ, ఆనందానికి
అద్దంపట్టిన కవిత ఇది. సుదూరప్రాంతాలలో ఉన్న తన వారి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి
కళ్ళు కాయలు కాసిన తల్లులు,
అవ్వలు తమ వారు తమ దరికి రాగానే,
ఆ పిల్లల కోసం చేసే ఏర్పాట్ల గురించి చెబుతూ కవి...
" ఇన్నాళ్ళు
కళ్ళకు కాసిన కాయలు
ఇక చెట్లకు
కాస్తాయి" అంటాడు.
అరిగిన
మోకాళ్ళ మధ్య తిరుగలి తిరుగుతుంది
నలిగిన వేళ్ళ మధ్య
కవ్వం చిలుకుతుంది " అంటూ పిల్లలకై పెద్దలు ప్రేమతో శక్తినంతా కూడదీసుకొని
చేసే పనులను దృశ్యాలు,
దృశ్యాలుగా మనముందుంచుతాడు కవి.
ఈ కవి రాజకీయ ఆశావాది. అందుకే..
"ఖద్దరు
ముసుగుల లొసుగులు
తొలగిపోయే క్షణాలు...తారాడే రోజుని
మేం చూస్తాం! చూసి తీరుతాం!! " అని ఖచ్చితంగా ప్రకటిస్తాడు.
పూలబాటైన రోజుని
రోజువారి పనిలో అలసట
ఆటపాటైన రోజుని
మేం చూస్తాం! చూసి తీరుతాం!! అని గుండెలనిండా ఆశావాదాన్ని
నింపుకొంటాడు. ఆశే కదా జీవితానికి భరోసా! ఆశే కదా జీవితానికి శ్వాస.
పేర్లలో ఎక్కడా తెలుగు దనం కనిపించకపోవడాన్ని ఈ కవి
నిరసిస్తాడు. అందుకే...
" అజంతంగా
ఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది" అంటాడు.
కలహాలతో కాపురం చెడగొట్టుకుంటే అది పిల్లలకు ఎంత శాపంగా మారుతుందో తెలిపే కవిత 'నాతో ఆడవా?'.
కొందరి దృష్టిలో
మనకు పాకిస్తాన్ శత్రుదేశమే కావొచ్చు. కానీ అక్కడ అందరూ మనకు శత్రువులు కాదు కదా!
ఒక చైతన్యం, ఒక
పోరాటం ఎక్కడైనా మన అస్తిత్వమే కదా! అందుకే కవి 'మలాలా '
గురించి గుల్ మకాయి '
కవిత రాశాడు. అందులో...
" నా
కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా
పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియ నేస్తమా!
నువ్ విరబూయడం కాంతి పంచే సూరీడుకి అవసరం " అని నొక్కి
చెబుతూ, హృదయానికి
హత్తుకుంటాడు.
నేర్చుకోవడానికే తప్ప జీవించడానికి, జీవితాన్ని
నడపడానికీ ఏ మాత్రం ఉపయోగపడని నేటి మన
విద్యా వ్యవస్థను నిరసిస్తూ...
"మొగ్గల్ని
పువ్వులవ్వనివ్వని మొరటుతనాన్ని
నాగరికత నేర్పుతుంది.
చేసిందే చేయడం ఇప్పుడో లెక్క
బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు" అంటూ అన్ని విషయాల
( సబ్జెక్ట్ల) దోరణిని తప్పుపడతాడు.
" జెండాలో రంగులు పైనా కింద పడి
తెల్లదనాన్ని
కుమ్ముతూ" ఉన్నాయంటూ దేశంలోని
మతకలహాల గురించి, శాంతి
అనిశ్చితి గురించి అన్యాపదేశంగా
ప్రస్తావిస్తాడు కవి.
అలాగే...అలాగే అను కవిత మధ్యతరగతి మహాభారతానికి చెందినది.
కేవలం ఇది కవిత మాత్రమే కాదు. ఒక్కో వాక్యం ఒక్కో జీవితం. చదివిన ప్రతి ఒక్కరు ఏదో
వాక్యంలో తమను తాము చూసుకుంటారు.
" తెగవలసినదని
తెలిసినా
తోడొచ్చే తల్లిపేగులా..." ఆ జ్ఞాపకాలు వెంటాడుతాయని చెబుతాడు.
కోట్లాది రూపాయల ప్రజాదనాన్ని వృధా చేసే ప్రభుత్వాలకు, దేశాలకు, సంస్థలకు
ప్రణాళికలు, సమావేశాల
మీద ఉన్న మోజు వాటి ఆచరణ మీద ఉండదన్న పచ్చి నిజాన్ని తెలిపే కవిత ' భయ్యా!
డైవర్సిటీ ఎక్కడా? '
" జీవ
వైవిధ్య సదస్సు ముగిసింది
ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి " అంటూ కవి తన
కలం పోటుతో దెప్పి పొడుస్తాడు. ఎప్పుడో చేనేత వారోత్సవాలపై వినాయకుడి వీణ పేరుతో
గోరా శాస్త్రి రాసిన చేనేత దృక్పతం వార్తావ్యాఖ్యను గుర్తుకు తెస్తాడు కవి.
ఆచరణకు
విలువివ్వని జీవవైవిధ్య సదస్సులంటే ఈ కవికి చికాకే కానీ, జీవులంటే
కాదు. అందుకే ఉడుత గురించి,
పిచ్చుక గురించి,
పాముల గురించి ప్రేమతో కవితలు రాశాడు.
ఇంకా ఈ పుస్తకంలో స్వేచ్చ పేరుతో కొనసాగుతున్న ఆధునిక కాలపు
విచ్చలవిడితనాన్ని,పండుగల
పరమార్థాన్ని మరిచి వాటిని వికృతంగా మార్చేసినా భక్తుల మూర్ఖత్వాన్ని, హింస, అతివాదం,పశుత్వం, విధ్వంసం, పక్కవాడి
నిర్లక్ష్యం మొదలగువాటిని నిరసించే కవితలు, శ్రమ విలువను
తెలిపే కవితలు తల్లీదండ్రులతో అనుబంధాన్ని తెలిపే కవితలు ఇందులో చాలానే ఉన్నాయి. కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళకు ఈ పుస్తకం ఓ మంచి బహుమతి అని మాత్రం నే
ఖచ్చితంగా చెప్పగలను.
ఇంకా ఈ కవి నుండి మరింత వైవిధ్యమైన శిల్పంతో, వస్తువుతో
కవిత్వం రావాలని ఆశిద్దాం!!
---నాయుడుగారి
జయన్న
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి