కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పటానికి చక్కటి ఉదాహరణ హల్‌ధార్
నాగ్. అతి సాధారణ జీవితం నుండి విశ్వ విద్యాలయ విద్యార్థులు తన రచనలపై పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగిన కృషీవలుడు. పశ్చిమ
ఒడిశా ప్రాంతానికి చెందిన హాల్దార్ నాగ్ కోస్లి భాషాకవి. 1950లో
ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జన్మించాడు. పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించాడు.
దానితో చదువు ఆగిపోయింది. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. చదువుకు
స్వస్తి చెప్పిన పిదప ఓ మిఠాయి దుకాణంలో పాత్రలు కడిగే పనికి కుదిరాడు. ఆ తర్వాత
కొద్ది కాలం పాటు ఓ బడిలో వంట పనివాడిగా పనిచేశాడు. అక్కడా కుదురుకోలేకా బ్యాంక్‌లో
అప్పు చేసి పుస్తకాల దుకాణం తెరిచాడు. ఆ పుస్తకాల దుకాణమే అతని జీవితాన్ని మార్చి వేసింది. అతనికి సాహిత్యంపై
మక్కువ కలిగేలా చేసింది. ఆవిధంగా సాహిత్య రచనలు చేయడం ప్రారంభించాడు. ఆయన రాసిన తొలి
పద్యం ధోడో బార్‌గజ్ (పెద్ద మర్రిచెట్టు) ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 1990లో స్థానిక
పత్రికలో ఈ రచన ప్రచురించబడింది. ఆ తర్వాత నాగ్ సాహిత్య రచనలో అంచెలంచెలుగా
ఎదిగాడు. ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలో 'లోక్ కవిరత్న 'గా
గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ కవి రచనలపై
విశ్వవిద్యాలయాల్లో ఐదుగురు విద్యార్థులు పి.హెచ్.డి. పట్టా కొరకు సిద్ధాంత
గ్రంథాలను సమర్పించారంటే ఎంతటి గొప్ప సాహిత్య కారుడో మనం ఉహించవచ్చు. అతని సాహిత్య కృషికి గుర్తింపుగా ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా
నాగ్ పద్మశ్రీ పురస్కారాన్ని కుడా అందుకున్నాడు. ఒడిశాలోని సంబల్ వర్సిటీ హల్‌ధార్
రచనలను గ్రంథబలీ-2
పేరుతో రూపొందించిన విశ్వవ్విద్యాలయ పాఠ్యప్రణాళికలో భాగం చేసింది. తెల్లటి పంచె, బనీను నిత్య
వస్త్రధారణగా కలిగి అతి సాధారణ జీవితం గడిపే హల్‌ధార్ నాగ్ ఎందరికో ఆదర్శప్రాయుడు.
కవిత్వం గురించి నాగ్ మాట్లాడుతూ...''
నా దృష్టిలో కవిత్వానికి నిజ జీవితంతో సంబంధం ఉండాలి. ప్రజలకు ఓ సందేశాన్ని
అందించాలి అంటాడు.'' నిజమే కదా! ఇప్పటి తరం కవులెంత మంది ఈ ప్రాతిపదిక మీద కవిత్వ రాస్తున్నారంటే చెప్పడం కష్టమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి