29, నవంబర్ 2016, మంగళవారం

ఏది అరాచకం ?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుశీర్షికన ఇంత అరాచాకమా? పేరిటి రాసిన ఎడిటోరియల్ చదివాకా, ఆయన అభిప్రాయాలకు, ప్రశ్నలకు నా సమాధానాలు... నా అభిప్రాయాలలోకి వెళ్లేముందు, నేను ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మద్దతుదారుణ్ణే కానీ, ప్రధానికి గానీ, ఆయన పార్టీకి గానీ మద్దతు దారున్ని కాదు. ఇక రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలకు నాలాంటి అతి సామాన్య దిగువ స్థాయి వ్యక్తులు కూడా సమాధానాలు చెప్పగలరనే ఉద్దేశ్యంతోనే ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం. ఆయన గారి అభిప్రాయాలు...నా సమాధానాలు

1. ప్రత్యామ్నాయ నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఉందా?
ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది? ఆధాయ పన్ను ఎగేసిన నల్ల నోటుకా? న్యాయబద్దమైన నోటు మార్పిడికి అవకాశం ఉంది కదా! మన దగ్గర అన్ని రూపాలలో పోగేసిన చట్టబద్దత లేని డబ్బుకంతా ప్రత్యామ్నాయం అడుగటం సమంజమేనా?

2. అటు ప్రధాని ఇటు ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది.
ప్రజలు ఇప్పుడు కొంత కష్టం కలిగి కంటతడి పెట్టుకుంటున్న మాట వాస్తవమే. ప్రజలతో పాటు ప్రధాని కూడా కంట తడిపెడుతున్నారు అని చెప్పినప్పుడు...ప్రజల ఏడుపులో(ఏ ప్రజలో ఇది మరో ప్రశ్న ) నిజాయితీని చూసిన రాధాకృష్ణ ప్రధాని ఏడుపులోని నిజాయితీని కూడా అంగీకరించినట్లే కదా!

3. డబ్బున్న వాడిపై డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం ఉన్నవారు చచ్చారుఅని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
అధికారంలో ఉన్న వాడిపై అధికారం లేని వాడికి కోపం ఉండటం రాజకీయనాయకుల సైకాలజీ అన్న మాటను RK అంగీకరిస్తాడా? డబ్బు ఉన్న వాడిపై డబ్బు లేని వాడు ఏడిస్తే (నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని ఏడ్చే వాళ్ళకు) భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాలేమిటో పనిలో పనిగా సెలవిచ్చి ఉంటే మా బోటి అజ్ఞానులం కోందరమైనా మారే వాళ్ళమే. నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని సంబరపడి పోకండి అని హెచ్చరించడంలో RK ఎటు వైపో అర్థం కావటం లేదా? ఆ ధ్వనిలో అర్థం స్పష్టం కావటం లేదా?


4. అవినీతి ఇవ్వాళ కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు.
• ....అంటే ఇది ఇలాగే ఉండాలా? అంతం ఉండొద్దా ?


5. మన దేశ ఆర్థిక వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి.
ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంతకు మించిన సిగ్గేస్తుంది. దేశానికి, రాష్ట్రాలకు రాబడి రావడమే ముఖ్యమా? వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడమే ముఖ్యమా? అది ఏ రూపానా? ఏ మార్గానా? అన్నది అక్కరలేదా? అదే అవునైతే... ఇన్ని బడు లెందుకు? ఇంతమంది ఉపాధ్యాయులెందుకు? ఇన్నిన్ని జీతాలెందుకు? ఇన్ని నీతి సూత్రాలెందుకు? బడి ఉన్న ప్రతి చోటా ఓ సారా దుకాణమో! ఓ నల్ల మందు అంగడో! ఏ వ్యభిచార కొంపో! ప్రభుత్వాలు పెట్టుకుంటే రాబడి రాదా? పెట్టుబడి మిగిలిపోయి, రాబడులు పెరిగిపోయి ప్రభుత్వాలు ఇక అన్ని రంగాలను 3 పువ్వులేమి కర్మ 6 పువ్వులకు 90 కాయలు కాయించగలదు. దీనికి RK ఒప్పుకుంటాడా?


6. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఒక్కసారిగా తమ ఆస్తుల విలువ పడిపోయిందని బాధపడుతున్న వారికి ఉపశమనం ఎవరు కలిగిస్తారో చెప్పాలి.
ఉన్న ఆస్తికి విలువ పడిపోయినప్పుడు, కొనదలచుకున్న ఆస్తి విలువ కూడా అంతే అన్న సత్యం బోధపడదా? ఇప్పుడు ఆస్తిపరులకు ఉపశమనం మాట సరే. ఆ మాత్రం ఆస్తి కూడా లేని పేదలకు ఇన్నాళ్ళు ఎవడైనా ఉపశమనం కలిగించాడా? అందులో శతాంశామైనా ఆస్తిని కూడ గట్టుకోగలమనే భరోసా ఇచ్చారా? “నల్లధనం ఉన్నవారు చచ్చారుఅని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారుఅని RK అనగాలిగాడంటే ఇప్పుడు ఆ పని ప్రధాని చేసినట్లే నని RK అంగీకరించగలడా?

7. ఏ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను ముద్రించారో చెప్పాలి.
తాత్కాలిక నోట్ల సర్దుబాటుకు/మార్పిడి కని సామాన్యుడికి సైతం అర్థమైంది. RK కు అర్థం కాలేదంటే విడ్డూరమే. 4 ఐదు వందలకు 1 నోటు, 2 వేయి నోట్లకు 1 నోటుతో సర్దుబాటు చేయడం, ముద్రణకు, సరఫరాకు ఎంతో ఉపయోగపడుతుందనే. కాలక్రమేణా అంతర్ధాన మవుతుందని చెబుతున్నా అదే ప్రశ్న వేయడంలో అర్థమేమిటో వేసేవారికే తెలియాలి.


8. దేశంలో ఇకపై నల్లధనం ఉండబోదని ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరా?
ఇకపై ఉంటుంది కాబట్టి, ఇప్పుడూ ఉండనీయమనడమా దీనర్థం. నీతి మంతుడిని మాత్రమే కనగలనని ఏ తల్లైనా హామీ ఇవ్వగలదా? కనడం, నిజాయితీగా పెంచడం, కలలు కనే వరకే తన బాధ్యత. ఆ తరువాత ఏమవుతాడన్నది వాడి ప్రవర్తనే నిర్ణయిస్తుంది. ఏ తల్లైనా అవినీతి పరుడిగా కొడుకును పెంచాలని కలలు కంటుందా? అయినప్పటికీ ఈ దేశంలో ఇంత మంది అవినీతి కొడుకులు ఎలా తయారు కాగలిగారో అర్థం కావడం లేదా?


9. ఇప్పుడు తాజాగా బంగారం కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించాలని కేంద్ర
ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మహిళలు తిరగబడతారు.

*“అక్రమ సంపాదన పోగేసుకున్నవారెవ్వరూ తమ ఇళ్లలో నగదును సూట్‌కేసులలో దాచిపెట్టుకోరు. భూములు, భవనాలు, బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెడతారు.అని అనే RK నే అట్లాంటి ఆస్తి విలువ తగ్గిందని ఒక చోట బాధపడుతాడు. ఆ నల్ల ధనంతో కొనే బంగారుపై ఆంక్షలు విదించొద్దని కోరుతాడు. ఇదేమి ద్వంద్వ నీతో అర్థం కాదు.


10. పచ్చిగా చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో మొదటిది... అవకాశం ఇచ్చినవాడిది తప్పా? అది సద్వినియోగం చేసుకోలేని వాడిది తప్పా? రెండోది మొదటి దాని కన్న అర్థవంతమైనది. ఆవశ్యకమైనది.

11. నల్లధనాన్ని నిజంగా అరికట్టాలన్న ఉద్దేశం ప్రధానమంత్రికి ఉంటే దుందుడుకు నిర్ణయాలు తీసుకునే బదులు ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.
ఒక పత్రికాధినేతగా, ఛానెల్ అధిపతిగా ఆ ఉద్దేశ్యంలో నీకు భాగస్వామ్యం లేదా? నీవు, నీ తోటి అధిపతులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఆ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలెంటో సూచించండి.


12. పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం.
ఒక ఆర్ధిక నిపుణుడు రాజ్యంగా బద్దంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలు మౌనంగా ఏలిన కాలంలో, ఒక రాజ్యాంగేతర శక్తి తెరవెనుక నిర్ణయాలు తీసుకుంటుందని అప్పటి ప్రతిపక్షం ఏడ్చినప్పుడు ప్రశ్నించని మీడియాకు, రాజ్యంగ బద్దంగా ఎన్నికై ఏలుతున్నవాడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏక పక్షమని ఏడుస్తుందేం?


----ఎన్. జయన్న

11 కామెంట్‌లు:

  1. అయ్యా మీ టపా అక్షరాలు ఒకదానిపై ఒకటి అలుక్కుపోయి ఏమీ అర్థం కావటం లేదు. దయచేసి ఫార్మాట్ సరిచేయండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్! నమస్కారం. మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యున్ని. నా facebook పేజి నుంచి ఇక్కడికి కాపీ చేసి తీసుకరావటం వలన ఈ అసౌకర్యం కలిగింది. ఇక ముందు ఈ ఇబ్బంది కలగకుండా చూసుకుంటా! దృష్టికి తీసుక వచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి

  2. >>>నా లాంటి సామాన్య వ్యక్తులు కూడా :)

    మీ జవాబుల పటిమ చూస్తోంటే సామాన్యులు కారు సుమా‌ అనిపిస్తోందండోయ్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi గారూ! నిజంగానే నేను సామాన్యుడిని. గొప్ప వ్యక్తులకు అలా అనిపించడంలో నా తప్పేమీ (ఘనతేమీ) లేదండోయ్!

      తొలగించండి
  3. శ్రీనివాసుడు1 డిసెంబర్, 2016 8:24 PMకి

    జయన్న గారూ!
    ఆంధ్రజ్యోతి భావజాలాల రేసిస్టు పత్రిక. ఆ పత్రికలో పడే వ్యాసాలన్నీ ఒక భావజాలానికి అనుకూలంగానే గరిష్ఠ భాగం వుంటలాయి. మీరు గమనిస్తే పది శాతం మాత్రమే వామపక్షేతర భావజాలం, దళితేతర భావజాలం వున్న వ్యాసాలు వస్తూవుంటాయి. కంటి తుడుపు చర్యగా వారానికోసారి బల్బీర్ కె. పుంజ్ వ్యాసం వేస్తాడు. మీరన్నట్లుగానే అతి సామాన్యుడు కూడా కె. శ్రీనివాస్ వ్రాసిన ఏ వ్యాసాన్నయినా చీల్చి చెండాడగలడు. అతడే కాదు, కంచ ఐలయ్య లాంటి మరొక రేసిస్టును కూడా చీల్చి చెండాడవచ్చు. కానీ, అలా చెండాడే వ్యాసాలు ఏవీ ఆ పత్రికలో వేసుకోబడవు. ఎడిటర్ అతడు కావడం మూలాన కేవలం యాంటీ రైటిస్టు పోకడలతోనే ఆ పత్రిక పోతోంది.

    ఆ దినపత్రికలో పడిన వ్యాసాలని, అనువాద వ్యాసాలని ఖండిస్తూ ఏ రోజుకా రోజు కనీసం ఆన్ లైన్ బ్లాగుల్లోనయినా వ్రాయాలని, లేదా, కనీసం ఖండించిన వ్యాసాల సమాచారం ఆన్ లైన్లో ఇవ్వాలని నేను చాలా రోజులనుండీ అనుకుంటున్నాను. ఎందుకంటే, ఆ అనువాద వ్యాసాలు ఏ పత్రికలో అయితే ప్రచురించబడ్డాయో ఆ పత్రికల్లోనే వ్యాఖ్యాతలు ముక్కలు ముక్కలుగా ఖండించడం నను చూసాను. అవి ఏవీ ఈ ప్రతికలో ప్రచురించబడవు.

    ఈ మధ్య ఎ. సునీత అనే ప్రొఫెసర్ త్రిపుల్ తలాఖ్ గురించి బల్బీర్ కె. పుంజ్ వ్రాసిన వ్యాసానికి ఖండనగా మరుసటిరోజు ఒక వ్యాసం వ్రాసారు.

    బల్బీర్ పుంజ్ ఆంధ్రజ్యోతిలో నవంబరు 4 న "తలాఖ్ రద్దుతోనే రాజ్యాంగ స్వేచ్ఛ" అనే అనువాద వ్యాసం
    http://epaper.andhrajyothy.com/989883/Andhra-Pradesh/04.11.2016#page/4/1

    దానికి సమాధానంగా మరుసటి రోజు ఈ రచయిత్రి "ముస్లిం వివాహ చట్లాలు మూడు తలాఖ్ లు" అనే వ్యాసం వ్రాసారు.
    http://epaper.andhrajyothy.com/991087/Andhra-Pradesh/05.11.2016#page/4/1

    దాన్ని ఖండిస్తూ నేను పంపిన వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించలేదు.

    ఆమె తన వ్యాసానికి కొనసాగింపుగా ’సారంగ‘ అనే వెబ్ పత్రికలో ఒక వ్యాసం వ్రాసారు.
    http://magazine.saarangabooks.com/2016/11/10/%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf/#comment-114980
    ఇక్కడ మన స్పందన వ్రాసే అవకాశం వుంటుందని నా స్నేహితుడు నరసింహారావు స్పందించి ఆమె చెప్పిన దాన్ని ఖండిస్తూ ఆమెకున్న పరిజ్ఞానం గురించి చర్చకు ఆహ్వానిస్తూ, ఒక రకంగా సవాలు విసురుతూ, సప్రమాణంగా ఒక వ్యాఖ్య వ్రాసాడు.
    దురదృష్టం ఏమిటంటే ఇది కూడా రేసిస్టు పత్రికే. వారు ఆ వ్యాఖ్యని ప్రచురించి, ఒక వారంపాటు వుంచి తరువాత తొలగించారు. అలాగే, ఆమెను విమర్శిస్తూ వ్రాసిన ఇంకో రెండు వ్యాఖ్యలు కూడా తొలగించారు.

    అందుచేత, లబ్ధప్రతిష్ఠమైన పత్రికలకు తమదంటూ రేసిస్టు అజెండా ఒకటి వుంటుంది. వారు వ్రాసినదాన్ని వెంటనే మీలాగ ఖండిస్తూ పోతేనే అసత్యాలు ప్రచారం కాకుండా అడ్డుకోగలం.
    ఏ ఇజం వైపుకి మొగ్గు చూపకుండా స్వేచ్ఛగా వ్యాఖ్యలైనా ప్రచురించే స్థాయికి ఆ పత్రికలు ఎదగలేదన్నది తేటతెల్లం.

    నేను చాలాకాలంనుండి అనుకున్న పనిని మీరు విజయవంతంగా చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
    ....శ్రీనివాసుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసుడు గారూ! ధన్యవాదాలు. ఇలాంటి పత్రికలు ఉండటం దురదృష్టకరం. పత్రికలు వాదాల వైపు కాకుండా ప్రజల వైపు, సత్యం వైపు నిలవాలని, ఆ రోజు వస్తుందని ఆశిద్దాం.

      తొలగించండి
  4. తెలుగు పత్రికలు అనే దానికన్నా పాంప్లేట్ అంటే సరిగ్గా ఉంట్టుంది. తెలుగు లో ప్రముఖ పేపర్లు అన్ని అసత్యాలను ప్రచారంచేయటం లో నిమగ్నమై పోయాయి. ప్రధాన కారణం బంగారం పైన కూడా ఎక్కడ పడతాడో అని భయం. నల్లధనం డబ్బు రూపంలో ఉండదు. భూములు గా, బంగారంగా, వజ్రాల రూపంలో ఉంట్టుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. టివి లో బంగారం మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకోం, ఆయనని పడగొడతాం. ఆడవాళ్ళు తలచుకొంటే ఎంతటి వారినైనా పదవీచ్యుతులను చేయగలరు అంట్టు మహిళలతో చెప్పించటం చాలా ఛానల్స్ చేస్తున్నాయి.

    వాటిలో పాల్గొనే వారికి, ఆ ఇంటర్వ్యులను ప్రసారం చేసేవారిని చూస్తే జాలేస్తుంది. వాళ్ల సామాజిక, రాజకీయ పరిజ్ణానం శూన్యం అని అర్థమౌతుంది. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాల వ్యామోహం సౌత్ లో ఎక్కువ. నార్త్ లో మధ్య తరగతి మహిళలకు ఇంతటి వ్యామోహం లేదు. సౌత్ లో ఆంధ్ర,తెలంగాణ, తమిళ నాడు,కేరళా రాష్ట్రాలలో బిజెపి యం.పి. ల సంఖ్య మొత్తం కలిపితే పది మంది కన్నా తక్కువ. ఈ రాష్ట్రాల మహిళలు ఓట్లేయ్యక పోతే వచ్చే ఎన్నికలలో బిజెపికి నష్టమేమి లేదు. అది గమనించకుండా వీళ్ళ ఓట్లతో మోడి ప్రధాని అయినట్లు ఫీలౌతున్నారు.

    ఈ చనల్స్ గోల ఎందుకంటే నలధనాన్ని బంగారంగా మార్చిన వారు, మోడి బంగారం పై వేటు వేస్తాడని అర్థమైంది. వాళ్లు బంగారం పై ఉచ్చుబింగించవద్దని రాయభారం చేసినట్లు ఉన్నారు. దానికి ఈ క్రమంలో తన ఉద్యోగం పోయినా ఫర్వాలేదు అని నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో తనను కలిసిన కొందరి వద్ద వ్యాఖ్యానించినట్టుగా చెబుతున్నారు. అది జీర్ణించుకోలేక "తస్మాత్ జాగ్రత్త!" మహిళలు తలచుకొంటే ప్రభుత్వాలే మారుస్తారని ప్రచారం మొదలు పెట్టారు.

    తెలుగు వాళ్ళ ఓట్లతో బిజెపి అధికారంలోకి రాలేదు. ప్రధాని మోడి పై తెలుగు మీడీయా బెదిరింపులు పనిచేయవు.

    రిప్లయితొలగించండి
  5. UG SriRam గారూ! ఈ చానల్స్ లో, పత్రికలలో చాలా మటుకు నల్లధనంతో నడుస్తున్నవే. అందుకే వీటికి కడుపుమంట. నిర్ణయం మంచిదయినప్పుడు, దానికి తూట్లు పొడుస్తున్న అంశాలను అరికట్టి, నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన విషయాన్ని ఇవి మరిచిపోయి ప్రవర్తించడమే దారుణం.

    రిప్లయితొలగించండి