4, మే 2016, బుధవారం

గుండాల జలపాతం


గుండాల జలపాతం మహబూబ్ నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్ళపై నుండి కృష్ణానది ప్రవహించడం వలన జలపాతం ఏర్పడింది. కృష్ణానది పడమటి దిశ నుండి తూర్పు వైపు ప్రవహిస్తూ జలపాతాన్ని
సృష్టిస్తుంది. కృష్ణానదికి ఉత్తరం వైపు ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామం, దక్షిణం వైపు ధరూర్ మండలం ఉంటాయి. జలపాతానికి ఎగువన పడమటి వైపు నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, దిగువన తూర్పు వైపు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది. ఈ జలపాతం కేవలం వేసవి కాలంలో మాత్రమే కనిపిస్తుంది. వర్షకాలంలో నది నిండుగా, విస్తారంగా, ఉదృతంగా ప్రవహించడం వలన జలపాతం కనిపించదు. వేసవిలో నీటి ఉదృతి తగ్గడం, ప్రవహం ఒక సన్నని పాయ వలే ప్రవహించడం, నదిలోని బండరాళ్ళు తేలడం వలన ఆ బండరాళ్ళ మీద నుండి లోయలోకి నీరు దూకడం వలన జలపాతం కనిపిస్తూ, కనువిందు చేస్తుంది. జలపాతం ఏర్పడటానికి ముందు నది విశాలంగా తక్కువ లోతులో ప్రవహించటం వలన సందర్శకులు నీటిలో జలకాలాడుతూ వేసవిలో సేదతీరుతారు. నదికి ఇరువైపులా ఆత్మకూరు, ధరూర్ మండలాలలోని ప్రజలే కాకుండా, సుదూర ప్రాంతాల నుండి కూడా సందర్శకులు వస్తుంటారు.

కనుమరుగవుతున్న కనువిందు
కృష్ణకు ఇరువైపులా ప్రజలను ఏళ్ళ తరబడి కనువిందు చేసి, సేదతీర్చిన జలపాతం ఇప్పుడు కనుమరుగైపోతుంది. కారణం ఇక్కడి జలపాతం దగ్గరే దిగువ జూరాల జల విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. దానికి తోడు కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణాపూర్ ఆనకట్టల నుండి రాష్ట్రానికి రావలసిన మొతాదులో నీటి విడుదల కాకపోవడం, ఎగువ జూరాల ప్రాజెక్టు నుండి మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజ్రెక్ట్, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, రామన్ పాడు ప్రాజెక్టు వంటి తాగు, సాగు నీటి పథకాలకు నీటి మళ్ళింపు అధికంగా జరగడం వలన అందమైన జలపాతం కనుమరుగైపోతుంది. దీనికి తోడు జిల్లాలో ఏర్పడిన విపరీత కరువు పరిస్థితుల కారణంగా గత వందేళ్ళలో ఎన్నడు కనిపించని విధంగా జలపాతం అడుగంటిపోయింది. సందర్శకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి