23, మార్చి 2015, సోమవారం

నా యాత్రానుభవాలు-6, హళేబీడు

2013  అక్టోబర్ నెలలో నేను, నా మిత్రుడు బషీర్ కర్ణాటకలోని ముఖ్యమైన ప్రాంతాలు చుట్టిరావడానికి నిర్ణయించుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మేము 14 వ తేది బేలూరు దర్శించి,  హళేబీడుకు చేరుకున్నాం.


 ఉదయం 10 గంటల ప్రాంతంలో  బేలూరు నుండి 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి . హళేబీడు కు చేరుకున్నాం.  హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. బేలూరు, హళేబీడు, శ్రావణబెళగోలాను కర్ణటక పర్యాటక శాఖవారు  స్వర్ణ  త్రికూటంగా పిలుస్తారు.  బేలూరును, హళేబీడును హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు.  హళేబీడు అనగా శిథిలనగరం. దీనికి పూర్వం  దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి.   అనగా సముద్రానికి ద్వారం వంటిదని.  ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ  మిగిలిపోయాయి. అందుకే దీనికి హళేబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.    
          ఈ హళేబీడు  12 - 13 శతాబ్ధి మధ్యకాలంలో  హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం  నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా  తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో  పూర్తైంది. దీని నిర్మాణంలో ప్రధానపాత్ర  కేదారోజ. ఈయన విష్ణువర్ధనుడి కుమారుడైన మొదటి నరసింహ దగ్గర ప్రధాన శిల్పి. 

బస్టాండ్ నుండి సరాసరి దేవాలయానికి వెళ్ళాం. ఆలయం బస్టాండ్‌కు దగ్గరలోనే ఉంది. ఆలయానికి చుట్టూ పచ్చటి  పచ్చిక పరిచి ఉంది. బేలూరు ఆలయం చుట్టూ ప్రహరి ఉంటే ఇక్కడ ఆలయం బయలు ప్రదేశంలో ఉంది. నక్షత్రాకారపు జగతి వేదిక మీద సుందర ఆలయం  మనల రమ్మని ఆహ్వానిస్తుంది.   ఇది ద్వికూటాలయం.  ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల
అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి.  ఆ శిల్ప సౌందర్యం వర్ణించతరం కాదు. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవలయాల నిర్మాణానికి సబ్బురాతిని ఉపయోగించారుఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక  విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో చిన్నపాటి గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం,  దగ్గరలోనే   ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.



ఆలయ సౌందర్యాన్ని ఆస్వాదించి, కాసేపు అక్కడి పచ్చికలో విశ్రమించి, ఆలయ సముదాయం వెలుపలికి వచ్చేశాం. దగ్గరలోని ఒక హోటల్లో అరటి ఆకుల్లో తృప్తిగా భోజనాలు కానిచ్చి, బస్టాండ్‌కు వచ్చేశాం. సూర్యుడు నడి నెత్తి మీద నుండి మెల్లగా  పశ్చిమం వైపు వాలుతుండగా శ్రావణబెళగోల వైపు బస్సులో  పయనమయ్యాం.

.








2 కామెంట్‌లు:


  1. బెలూరు,హాలెబీడు లను నేను కూడా ఒకసారి సందర్శించాను.అక్కడి ఆలయాలు బహు సుందరమైనవి.శిల్పకళాశోభితమైనవి.హొయసాలరాజులకు సమకాలీనులైన కాకతీయుల చే నిర్మితమైన ఆలయాలు కూడా నిర్మాణంలో,వాటినిపోలిఉంటాయి.అంటే ఆశతాబ్దాల నిర్మాణ,శిల్ప రీతులలో వచ్చిన పరిణామాలు తెలుస్తాయి.

    రిప్లయితొలగించండి
  2. అవును సార్! గొప్ప శిల్ప సంపదకు అవి నిలయాలు.

    రిప్లయితొలగించండి