24, ఫిబ్రవరి 2015, మంగళవారం

హైకూల చంద్రుడు - తలతోటి పృథ్విరాజ్

ఊరి నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా, కోఠి సమీపంలోని బ్యాంక్ వీధిలోని  విశాలాంధ్ర కు వెళ్లి రావడం నాకు ఆనవాయితీ. అలా వెళ్ళిన ఒక సారి ఓ పది రూపాయల చిన్న పుస్తకమొకటి కంట పడింది. పేరు వెన్నెల. తీసుకొచ్చుకున్నాను. మూడు చిట్టి పాదాల హైకూ ప్రక్రియలో  రాయబడిన పుస్తకమది. అందులోని ప్రతి హైకూ నాకెందుకో గొప్పగా అనిపించాయి. ఆ పుస్తకాన్ని ఎన్ని సార్లు చదువుకున్నానో.. చదివిన ప్రతి సారి ఓ గొప్ప అనుభూతి. అలా ఆ పుస్తకం పరిచయం చేసిన కవే - తలతోటి పృథ్విరాజ్,  మీ కోసం మరిన్ని వివరాలు.  

తలతోటి పృథ్విరాజ్  ప్రముఖ తెలుగు కవి. ఆధునిక కవిత్వ ప్రక్రియలలో ఒకటైన హైకూ రచనలో విశేష కృషి చేస్తున్నాడు. హైకూను ఇంటిపేరుగా మార్చుకున్న పృథ్విరాజ్ ''ఇండియన్ హైకూ క్లబ్‌ను స్థాపించి, హైకూ ప్రక్రియా వ్యాప్తికి తోడ్పడుతున్నాడు.

 జీవిత విశేషాలు 
సత్యానందం, సామ్రాజ్యం దంపతులకు 1970 ,జూలై 6 న నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు. ప్రకాశం జిల్లా,అద్దంకిలోని రవీంద్ర భారతి పబ్లిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం తుబదులో 6 వ తరగతి పూర్తిచేసిన అనంతరం, తిరిగి అద్దంకిలోని ప్రకాశం బాలుర పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు. బాల్యంలో మద్దులేటి మాస్టార్ ప్రోత్సాహంతో చదువును కొనసాగించాడు. తన బాల్య స్మృతులే అతడిని హైకూ కవిగా మార్చాయి. విజయవాడలోని లయోల కళాశాలలో బి.ఏ., హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పూర్తిచేశాడు. ఆచార్య పర్వతనేని సుబ్బారావు మార్గదర్శకత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్రేయ సినిమా సంభాషణల మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. 
వృత్తి జీవితం 
2000 సంవత్సరంలో అనకాపల్లిలోని ఏ.ఎం.ఏ.ఎల్.లో తెలుగు అధ్యాపకులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అనేక జాతీయ వేదికల మీద తెలుగు సాహిత్యంపై పత్రాలు సమర్పించాడు.

సాహిత్య జీవితం
10 వ తరగతి నుండే కవిత్వం రాయడం ప్రారంభించిన పృథ్విరాజ్, ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తన మొదటి కవిత అచ్చయ్యాక, అదే స్ఫూర్తితో ఆ తర్వాత అనేక కవితలు, కథలు రాశాడు. వీటితో పాటు బొమ్మలు గీయడం వీరికి ఉన్న మరో అభిరుచి. ఇతని రచనలు అనేకం మయూరి వార పత్రికలో ప్రచురించబడ్డాయి.
రచనలు 
తలతోటి పృథ్విరాజ్ హైకూలు ప్రక్రియలో ప్రధానంగా కవిత్వం రాసినా, దీర్ఘ కవిత, నానీలు మొదలగు ఇతర కవిత్వ ప్రక్రియలలోనూ రచనలు చేశాడు.
హైకూ సంపుటులు 
* వెన్నెల
* చినుకులు
* వసంతం
* రోజుకో సూర్యుడు
* నీలాకాశం
* కలువలు
* చంద్ర కిరిటీ
* ఋతు బ్రమణం
* పృథ్వీ సెన్‌ర్యూ
* పృథ్వీ టంకాలు
* పృథ్వీ ఫోటో హైకూలు

దీర్ఘ కవితలు 
* మనిషి
* నల్ల దొరలు
ఇతర రచనలు 
* మనసు కవి ఆత్రేయ నాటక సాహిత్యం - సంభాషణలు (విమర్శా గ్రంథం)
* మనిషిలో...(కవిత్వ నిర్వచనా రచన)
* అడుగులు (నానీలు)






2 కామెంట్‌లు:

  1. నాయుడు గారి జయన్న గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ రోజే నా పై మీరు రాసిన వ్యాసం చూసి చదివాను. సంతోషించాను. మరి ముఖ్యంగా మీరు వ్యక్తీకరించిన అనుభూతిని తెలుసుకొని మరింత సంతోషించాను. మీతో నేను పర్సనల్ గా మాట్లాడాలని మీ నెంబర్ తెలియక ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. తప్పక మాట్లాడతారని ఆశిస్తున్నాను. 9963299452 . నా మెయిల్ ఐడి talathotiprithviraj@gmail.com

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం సార్! చాలా సంతోషం. తప్పకుండా ఫోన్ చేస్తాను.

    రిప్లయితొలగించండి