18, మార్చి 2025, మంగళవారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 


స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ పుస్తకం సంపాదకులు.  ఈ పుస్తకం ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది.  వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే.  ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే.  శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే.    ముక్తపదగ్రస్త విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది.  అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం అన్నమాట.  సంపాదకులు గ్రంథాన్నే ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను  కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం  ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ. పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.

ఈ పుస్తకం  గురించి సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో  ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.

 

ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256

15, మార్చి 2025, శనివారం

ఊర ఈశ్వర్ రెడ్డి

 


ఊర ఈశ్వర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పద్య కవి.  పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలంలోని కోవెలదిన్నె గ్రామంలో జన్మించారు.  1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి.  వీరి భార్య ఊర ఈశ్వరమ్మ.  స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు  ప్రాథమిక విద్యను అభ్యసించారు.  సమీపంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు.  ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు.  సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి. 



 రచనలు 

1.వెంకటేశ్వర దిశతి 

2.చెన్నకేశవ శతకం 

3.కవితాలహరి

4. సమస్యా పూరణం 

5.ముక్తిపథం 

6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి చరిత్ర

7.  పెద్దదిన్నె శ్రీవెంకటేశ్వరస్వామి చరిత్ర

2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ  అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం- 

శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా 

తిరుమలగిరి పైన తిరముగాను

వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి

 విశ్వమందు నిజము వేంకటేశ

2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.

జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక,  శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

26, ఫిబ్రవరి 2025, బుధవారం

డా. ఎస్. జి. రామానుజాచార్యులు


 డా. ఎస్. జి. రామానుజాచార్యులు తెలుగుకవి, రచయిత. హైదరాబాద్ వాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ ఫ్యాకల్టీకి పీఠాధిపతిగా పనిచేశాడు. జూన్ 15, 1944 వ తేదిన హైదరాబాద్లో  జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఆండాళమ్మ, ఎస్. జి. నరసింహాచార్యులు. ఇతని పూర్వికులు నల్లగొండ జిల్లా ,సూర్యాపేట సమీపంలోని మంగలపల్లి గ్రామానికి చెందినవారు. 1977లో వీరు ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర అను అంశంపై పరిశోధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు.

విద్యాభ్యాసం 

శ్రీవెంకటేశ్వర వేందాంత వర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదులో బి.ఓ.ఎల్., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.,(తెలుగు), పి.హెచ్డీ. చేశారు.

ఉద్యోగం 

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గవర్నమెంట్ ఆంధ్ర ఓరియంటల్ కాలేజీ, హైదరాబాద్, తెలుగు శాఖ పీజీ విభాగంలో వీరు ఉపన్యాసకులుగా, రీడర్గా, ప్రధాన ఆచార్యులుగా వివిధ హోదాలలో 33 సంవత్సరాలు పనిచేశారు. 1995 నుంచి 1998 వరకు ఓరియంటల్ ఫ్యాకల్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు.  2001 జూలై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ ఫ్యాకల్టీకి డీన్ గాను పనిచేశారు. 1984లో వీరి సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రధానంతో సత్కరించింది. అవార్డును నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు.

రచనలు 

1.ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర

2. మాయా మానవుని చైతన్య కిరణాలు

3.దండి దశకుమార చరిత్ర(ఆంధ్రానువాదం)

4. గాలిబ్ కవితాశిల్పం (సాహిత్యవిమర్శనా గ్రంథం)

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రచురణలు తెలుగు కవితా సౌరభాలు, తెలుగు సాహితీ స్రవంతి వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సాహితీ సేవలో అంతర్భాగంగా వీరు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం నేతృత్వంలో సాగిన ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం- ఒకటి, రెండు, మూడు సంపుటాలలో 38 సాహితీ, చారిత్రక వ్యాసాలను రచించారు. కళాశాల ప్రచురణ- నన్నయ్య ప్రసన్న కథ లోతులు గ్రంథానికి సంపాదకత్వం వహించారు. 





17, ఫిబ్రవరి 2025, సోమవారం

2001-02 విద్యార్థులతో...


 

శ్రీసరస్వతీ విద్యామందిరం, గద్వాలలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టినప్పుడు...వీళ్లు నా మొదటి 10 వ తరగతి బ్యాచ్.

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఆంధ్రజ్యోతిలో దృక్కోణం

 



తమ బుక్ షెల్పులో చోటిచ్చినందుకు ఆదివారం ఆంధ్రజ్యోతికి, గొరుసు జగదీశ్వర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు