10, ఏప్రిల్ 2022, ఆదివారం

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

 

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపర సౌలభ్యం కోసం పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాల భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకొని గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ సాహిత్య చరిత్రలను రాయించింది. అవి కొంత మేరకు ప్రయోజనాన్ని కలిగించడమే కాకుండా ముందు ముందు జరగాల్సిన కృషికి బాటలు వేశాయి. ఆ కోవలోనే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు నూతన జిల్లాల ప్రాతిపదికన కేవలం సాహిత్యంతోనే ఆగిపోకుండా, జిల్లాలకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాలని సంకల్పించింది. ఆ  ప్రయత్నంలో భాగంగా తెలంగాణ 33 జిల్లాల నుండి వెలువడిన మొదటి గ్రంథమే జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం.  ఇందులో జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, కళలు, పర్యాటకం, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉద్యమాలు – ఉద్యమకారులు, జిల్లా పద్య, గేయ, వచన కవిత్వాలు, కథ, నవల, నాటక వికాసాలు వంటి    ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సంస్థానాలు – చరిత్ర, సాహిత్య పోషణ వంటి అనేక విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ ఎవరో రాజధానిలో కూర్చొని ఉద్దండులైన రచయితలు రాసిన వ్యాసాలు కావు. ఆయా జిల్లాల సమగ్ర చరిత్రను ఆయా జిల్లాల రచయితల చేతనే రాయించాలనే ఓ గొప్ప ఆశయానికి అక్షరరూపం ఈ గ్రంథం.  జోగులాంబ గద్వాల జిల్లా విషయాలు, విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సహం కలిగిన ప్రతి ఒక్కరు చదవదగిన పుస్తకం.

ప్రతులకు...

తెలంగాణ సారస్వత పరిషత్తు

తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ -500 001.

పోన్. 24753754

- నాయుడు గారి జయన్న3 కామెంట్‌లు: