15, డిసెంబర్ 2024, ఆదివారం

నా కొత్త పుస్తకం

 కొన్ని పుస్తకాలపై, కొందరు రచయితలపై అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఇలా పుస్తకంగా తీసుకవస్తున్నాను.



ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి

 *🔴ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి----CODE OF CONDUCT*


స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు క్రిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించే సందర్భంలో సత్ప్రవర్తన కలిగి పని చేయాలి.


అందుకోసమై మార్గదర్శక ప్రవర్తనా నియమావళి 1964ను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రవర్తనా నియమావళికి లోబడే ఉద్యోగులందరూ తమ విధులను నిర్వహించాలి. అటువంటి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి ప్రవర్తించిన ఉద్యోగులపై అర్హత గల నిర్దేశిత అధికారులు గానీ, ప్రభుత్వం గానీ క్రమశిక్షణా చర్యలు తీసుకుని తగిన పద్ధతిలో శిక్షిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తనా *నియమావళి ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.*



*🎯ఎవరికి వర్తిస్తాయి.. ఎవరికి వర్తించవు..?*


తెలంగాణ ప్రభుత్వ సివిల్ సర్వీసులో ఉన్న ప్రతి సభ్యునికి, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏ పోస్టులో పనిచేస్తు వారైనప్పటికీ, వారందరికి ప్రవర్తనా నియమావళి వర్తిస్తాయి. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు, గ్రామ పరిపాలన యంత్రాంగం, ప్రత్యేక పద్దు నుంచి చెల్లింపులు పొందువారికి వర్తించవు. 


*⛔కుటుంబ సభ్యులంటే ఎవరు..?-* 


ఉద్యోగిపై ఆధారపడిన భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి కూతురు, ఉద్యోగితో పాటు నివాసముంటున్నా, లేకపోయినా.. ఉద్యోగికి చెందిన ఏ ఇతర బంధువైనా, అతనితో నివాసముంటూ అతనిపై ఆధారపడి ఉన్నవారు. ఉద్యోగి నుంచి చట్టరీత్యా విడిపోయిన భార్య / భర్త, ఉద్యోగిపై ఏ విధంగానూ ఆధారపడకుండా ఉన్న కుమారుడు, కుమార్తె, కుమారుడు, సవతి కుమార్తె లేక చట్టరీత్యా ఉద్యోగి సంరక్షణలో లేని వ్యక్తి. 


*🎯ప్రవర్తనా నియమావళి..*


ప్రతి ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను అంకితభావంతో నిర్వర్తించాలి. అంకితభావం అంటే విశ్వతనీయత కలిగి పని చేయడం. అదే విధంగా పూర్తి నిజాయితీగా, క్రమశిక్షణ కలిగి, నిష్పక్షపాతంగా న్యాయబద్ధతంగా కలిగి పనిచేయాలి. ఉద్యోగి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉండకూడదు. 


*🎯Rule 3 (a):* ఏ ఉద్యోగియైనా దేశ భద్రతకు,రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశం గల సంస్థలతో సంబంధాలు కలిగి సభ్యునిగా ఉండకూడదు. 


*🎯Rule 3 (b):* విధి నిర్వహణలో గాని, ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు. తనకు కేటాయించినపనిని దురుద్దేశంతో గాని మరి ఇత రత్రా కారణాల వల్లగాని అదే పనిగా ఆలస్యం చేయకూడదు. 


*🎯Rule 3 (C) :* ఏ ఉద్యోగి అయినా సరే తన విధి నిర్వహణలో ఉద్యోగినిల విషయంలో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అమర్యాద పూర్వకంగా కాని, అసభ్యంగా గాని ప్రవర్తించకూడదు. అదే విధంగా లైంగిక వేధింపులకు గురిచేయకూడదు. 


*🎯Rule 4:* ఏ ఉద్యోగి కూడా సమ్మెలు తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు. 


*🎯Rule 5*: రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనలలో పాల్గొనకూడదు. 


*🎯Rule 6:* ఏ ఉద్యోగి కూడా బహుమతులు స్వీకరించకూడదు. 


*🎯Rule 6 A:* విదేశాల నుంచి డబ్బుగాని లేక 10,000 రూపాయల విలువగల వస్తువులు గాని ఎవరి నుంచైనా, ఉద్యోగి కాని, కుటుంబ సభ్యులు కాని లేక వారి తరఫున ఏ వ్యక్తియైనా పొందితే సంబంధిత అధికారికి తెలియజే యాలి.(G.O.Ms. No. 354, GAD, dt: 8-8-1996) 


*🎯Rule 7:* ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయడం గాని, తీసుకోవడం గాని చేయకూడదు. 


*🎯Rule 8 :* ఏ ఉద్యోగియైనా ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా తన ఉద్యోగ కార్యకలాపాల పరిధిలోని వ్యక్తులతో గాని ఇతరత్రా అప్పు తీసుకొనకూడదు. అదే విధంగా వడ్డీకి అప్పు ఇవ్వరాదు. 


*🎯Rule 9 :* ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి ముందుగా తెలుపకుండా లేక అనుమతి పొందకుండా తానుగాని తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు గాని స్థిరాస్థులు కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదు. ఈ విషయంలో కొన్ని మినహాయింపులు చేశారు. 


*🎯Rule 10*: ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రైవేటు వ్యాపారాలు తదితరాలు చేయకూడదు. అదే విధంగా బీమా ఏజెంటు గానూ, కమిషన్ ఏజెంటుగాను పనిచేయకూడదు. 


*🎯Rule 11:* ఏ ఉద్యోగి కూడా తన వ్యక్తిగత హెూదాలో బ్యాంకులు గానీ, రిజిష్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కానీ సమాజ సేవా దృక్పథంతో రిజిష్టరు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చును. 


*🎯Rule 12*: ప్రభుత్వ ఉద్యోగస్థులు తమ ఉద్యోగ బాధ్యతలు తప్ప ఏ విధమయిన ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు. 


*🎯Rule 13:* ప్రభుత్వ ఉద్యోగి ఏవైనా పుస్తకాలు ప్రచురించదలచిన ప్రభుత్వ పూర్వానుమతి పొందాలి. ఈ విషయమై కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం G.O.Ms. No. 553, GAD, 8: 8-8-1974 2 జారీ చేసింది. 


*🎯Rule 14*: ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన స్వాధీనంలో వున్న డాక్యుమెంట్లు తనకు తెలిసిన ఇతర కార్యాలయపు విషయాలు అనధికారులకు గానీ లేక పత్రికల వారికి గాని తెలియజేయకూడదు. కానీ సమాచార హక్కు చట్టం- 2005 వచ్చిన తరువాత దీనికి కొంతమేర మార్పులు చేసారు. (G.O.Ms. No. 114, GAD, dt: 16-3-2009) 


*🎯Rule 15:* ఏ ఉద్యోగి కూడా వార్తాపత్రికలకు గాని, ప్రభుత్వేతర ప్రచురణలకు గాని సంపాదకత్వం చేయటం, వాటితో ఏ రూపంలోనైనా కలిసి పనిచేయకూడదు. 


*🎯Rule 16:* పత్రికలకు, అదేవిధంగా దఫాలుగా ప్రచురితమయ్యే నియమితకాల పత్రికలకు లేఖలు గాని, వ్యాసాలు గాని ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా వ్రాయడం నిషేధం. కాని సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ సంబంధిత వ్యాసాలు కాని, వాటి ఆధారిత రేడియో ప్రసంగాలు గాని చేయవచ్చును.

15, ఏప్రిల్ 2024, సోమవారం

మాట్లాడే నాగలి



 
మలయాళ రచయిత 'పొన్కున్నం వర్కెయ్' రచించిన 'మాట్లాడే నాగలి' కథను ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రేమ భూమికగా  8వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చింది.‌
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ పాఠాన్ని కళ్ళల్లో కన్నీటిజాడలను పిల్లలకు కనపడకుండా దాచేస్తూ, బోధించడ మనేది నాకో సమస్యా, సవాల్ కూడా.

రైతు -ఓసెఫ్, ఎద్దు -కన్నన్...పన్నెండేళ్ల పాటు ఒకరి కోసం ఒకరు జీవితాన్ని ఎట్లా ధార పోసుకున్నారు. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ఆప్యాయతలను చూపుకున్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్న కన్నన్ ను ఓసెఫ్ ఎందుకు అమ్ముకోవలసి వచ్చింది? చివరికి కన్నన్ ఎక్కడికి చేరింది? అన్నదే కథ. రైతుకు ఎద్దులకు మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చిత్రించిన కథ.

జంతువుల మీద ఇంత ప్రేమను చూపించే ఇట్లాంటి మనుషులు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉంటారా? అంటే, ఈ వీడియోనే సాక్ష్యం. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం యాక్తాపూర్ గ్రామానికి చెందిన ఎల్లన్న  తన ఇంట్లోనే పుట్టిన దూడలను పెంచాడు. 14 సంవత్సరాలు వాటితో అనుబంధాన్ని పెంచుకున్నాడు. కుటుంబ అవసరాల రీత్యా ఆ ఎద్దులను అమ్ముకున్నాడు. ఇద్దరు రైతుల చేతులు మారాకా మూడోసారి సంతకు అమ్మకానికి వచ్చాయి. అక్కడే వాటిని చూసిన ఎల్లన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మాట్లాడే నాగలి ఓసెఫ్ ను గుర్తు చేశాడు. రైతులకు పశువులకు మధ్య ఉండే అవ్యాజమైన ప్రేమకు మరోసారి నిదర్శనమయ్యాడు. 

3, మార్చి 2024, ఆదివారం

నేనూ - గొరుసు - గజఈతరాలు

                                                                                                                                                             ఊహాజనిత కల్పిత కథాజగత్తును దాటి వాస్తవ జీవితాలను చిత్రించిన కథలను చదవడం మొదలుపెట్టి అప్పటికి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిలోనూ తెలియని మనుషులు, తెలియని భాష, తెలియనిఊర్లూ, వీధులూ అన్ని పరాయివే. ఎవరో తెలియని మనుషుల జీవితాలు చదువుతున్నట్లూ, చూస్తున్నట్లూ ఉండేది. మొదటిసారి 1998 మార్చిలో ఆంధ్రప్రభ వార పత్రికలో ‘ఉసుళ్ళు ‘ పేరుతో ఓ కథ కంటపడింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మరో కథ ‘గజఈతరాలు’ చూశాను. అంతవరకు మావి అనిపించిన కథలను చూడని నాకు ఈ రెండు కథలు ఆ లోటును తీర్చేశాయి. ఈ కథలు మావే. ఈ భాషా మాదే. ఈ కథల్లో ప్రస్తావించబడిన మహబూబ్ నగర్, గద్వాల, ఉప్పేరు,పెబ్బేరు, బీచుపల్లి, రంగాపురం, వనపర్తి, దేవునిపాలెం, గుడ్లనర్వ అన్నీ మా ఊర్లే. వల్లభనగర్, రాయిగడ్డ, మర్రికుంట అన్నీ మా వీధులే. సాయమ్మ, బాలామణీ, పూర్ణమ్మ అందరూ మా మనుషులే అన్పించింది. ఈ కథలు మనుసుకు ఎంతో దగ్గరైపోయాయి. 

              ‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో! గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.


       ‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం. 

     ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది. 

      ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా. 

     ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది. 

     ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.

       గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.

       ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ.... 
- నాయుడు గారి జయన్న
      03.03.2024