15, మార్చి 2025, శనివారం

ఊర ఈశ్వర్ రెడ్డి

 


ఊర ఈశ్వర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పద్య కవి.  పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలంలోని కోవెలదిన్నె గ్రామంలో జన్మించారు.  1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి.  వీరి భార్య ఊర ఈశ్వరమ్మ.  స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు  ప్రాథమిక విద్యను అభ్యసించారు.  సమీపంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు.  ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు.  సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి. 



 రచనలు 

1.వెంకటేశ్వర దిశతి 

2.చెన్నకేశవ శతకం 

3.కవితాలహరి

4. సమస్యా పూరణం 

5.ముక్తిపథం 

6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి చరిత్ర

7.  పెద్దదిన్నె శ్రీవెంకటేశ్వరస్వామి చరిత్ర

2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ  అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం- 

శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా 

తిరుమలగిరి పైన తిరముగాను

వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి

 విశ్వమందు నిజము వేంకటేశ

2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.

జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక,  శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

26, ఫిబ్రవరి 2025, బుధవారం

డా. ఎస్. జి. రామానుజాచార్యులు


 డా. ఎస్. జి. రామానుజాచార్యులు తెలుగుకవి, రచయిత. హైదరాబాద్ వాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ ఫ్యాకల్టీకి పీఠాధిపతిగా పనిచేశాడు. జూన్ 15, 1944 వ తేదిన హైదరాబాద్లో  జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఆండాళమ్మ, ఎస్. జి. నరసింహాచార్యులు. ఇతని పూర్వికులు నల్లగొండ జిల్లా ,సూర్యాపేట సమీపంలోని మంగలపల్లి గ్రామానికి చెందినవారు. 1977లో వీరు ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర అను అంశంపై పరిశోధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు.

విద్యాభ్యాసం 

శ్రీవెంకటేశ్వర వేందాంత వర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదులో బి.ఓ.ఎల్., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.,(తెలుగు), పి.హెచ్డీ. చేశారు.

ఉద్యోగం 

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గవర్నమెంట్ ఆంధ్ర ఓరియంటల్ కాలేజీ, హైదరాబాద్, తెలుగు శాఖ పీజీ విభాగంలో వీరు ఉపన్యాసకులుగా, రీడర్గా, ప్రధాన ఆచార్యులుగా వివిధ హోదాలలో 33 సంవత్సరాలు పనిచేశారు. 1995 నుంచి 1998 వరకు ఓరియంటల్ ఫ్యాకల్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు.  2001 జూలై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ ఫ్యాకల్టీకి డీన్ గాను పనిచేశారు. 1984లో వీరి సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రధానంతో సత్కరించింది. అవార్డును నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు.

రచనలు 

1.ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర

2. మాయా మానవుని చైతన్య కిరణాలు

3.దండి దశకుమార చరిత్ర(ఆంధ్రానువాదం)

4. గాలిబ్ కవితాశిల్పం (సాహిత్యవిమర్శనా గ్రంథం)

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రచురణలు తెలుగు కవితా సౌరభాలు, తెలుగు సాహితీ స్రవంతి వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సాహితీ సేవలో అంతర్భాగంగా వీరు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం నేతృత్వంలో సాగిన ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం- ఒకటి, రెండు, మూడు సంపుటాలలో 38 సాహితీ, చారిత్రక వ్యాసాలను రచించారు. కళాశాల ప్రచురణ- నన్నయ్య ప్రసన్న కథ లోతులు గ్రంథానికి సంపాదకత్వం వహించారు. 





17, ఫిబ్రవరి 2025, సోమవారం

2001-02 విద్యార్థులతో...


 

శ్రీసరస్వతీ విద్యామందిరం, గద్వాలలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టినప్పుడు...వీళ్లు నా మొదటి 10 వ తరగతి బ్యాచ్.

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఆంధ్రజ్యోతిలో దృక్కోణం

 



తమ బుక్ షెల్పులో చోటిచ్చినందుకు ఆదివారం ఆంధ్రజ్యోతికి, గొరుసు జగదీశ్వర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు

22, జనవరి 2025, బుధవారం

వెన్నెల సత్యం -‘గుల్ మొహర్’

 


గుల్ మొహర్  అందమైన పూల చెట్టు. మా ప్రాంతంలో (జోగులాంబ గద్వాల జిల్లా) అయితే దీనిని సుంకేసుల చెట్టు అంటాం. ఆయా ప్రాంతాల్లో ఇంకా భిన్నమైన పేర్లు కూడా ఉండవచ్చు.  ఒకప్పుడు ఈ చెట్టు లేని బడి, కాలేజీ ఉండేది కాదు. ఇప్పుడైతే అక్కడక్కడ రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. అవి పూసే కాలంలో రోడ్లకు ఎంత అందమో వర్ణించలేం. గొప్ప అందాన్ని ఇచ్చే ఈ పూలకు అంతే పరిమళం ఉందో లేదో చెప్పలేను. కానీ ఆ పేరుతో వచ్చిన ఈ పుస్తకం నిండా కవిత్వ పరిమళమే. గుల్జార్ కవిత్వ పరిమళమే.

    హిందీ సినిమాలతోనూ, హిందీ సాహిత్యంతోనూ, అనువాద సాహిత్యంతోనూ పరిచయం ఉన్నవారికి గుల్జార్ తెలిసి ఉండవచ్చు.  కానీ నాలాంటి సాధారణ తెలుగు పాఠకుడికి సైతం గుల్జార్ను చేరువ చేసిన ఘనత మాత్రం వెన్నెల సత్యం గారిదే.  గుల్జార్ కవిత్వాన్ని స్వేచ్ఛనువాదం చేస్తూ,  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చిన సత్యం గారు వాటన్నిటిని కలిపి ఇప్పుడు గుల్ మొహర్ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.

    పాద, గణ, మాత్ర నియమాలు అంటూ ఏమీలేని ఈ మినీ కవితల్లో ఎక్కువ భాగం నానీల లాగే నాలుగు పాదాల్లో నడిచాయి. వీటిని కవి గుల్ మొహర్ లని పిలిచాడు.   ఒక్కో గుల్ మొహర్  కవిత్వ పరిమళాన్ని వెదజల్లే ఒక్కో గుల్ మొహర్ పువ్వే. మచ్చుకు ఈ పుస్తకంలోని మొదటి గుల్ మొహర్ ను చూడండి-

ముళ్ళను ఎందుకు

నిందిస్తావు మిత్రమా

నీ పాదాలే వాటిపై ఉంచావు

అవి వాటి చోటనే ఉన్నాయి

 

 లోకంలో ఎవరికి లేనన్ని కష్టాలు నాకే ఎదురవుతున్నాయి. నాకే ఎందుకిన్నీ కష్టాలని  వాపోతామే కానీ,  మన ఏ చేతల వలన, ఏ అచేతనం వలన కష్టాలు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకోం.   దాన్ని గుర్తుచేసే గుల్ మొహరే కదా ఇది. 

మరోకటి-

కప్పు టీ తోపాటు

పాత కథల్ని పంచుకుంటున్నారు

 టీ చల్లారిపోయింది

 కళ్ళు తడిగా మారాయి

ఈ గుల్ మొహర్ లో మనల్ని మనం చూసుకోలేమా! మన జీవితం అద్దంలో దర్శనం ఇచ్చినట్లుగా అనిపించదా! ఇట్లా ఎన్ని కథలని, టీలతో కలిపి, మిత్రులతో పంచుకుని కన్నీళ్ళతో తడిసిపోయిన జ్ఞాపకాలు మనకు లేవా! ఈ విధంగా ఈ పుస్తకం నిండా నేను, మీరు, మనం, మన అనుభవాలు కనిపిస్తాయి.  ఇందులో నిజాలు, నిష్టూరాలు, జీవిత అనుభవాలు, జీవిత పాఠాలు, పగిలిన హృదయాలు అన్నీ మనకు దర్శనమిస్తాయి. ఇది చదవదగిన పుస్తకం. గుల్జార్ కవిత్వాన్ని తెలుగు వాళ్లకు అందించిన వారి సరసన నిలిచినందుకు, మంచి కవిత్వాన్ని అందించినందుకు వెన్నెల సత్యం గారిని అభినందించాల్సిందే!