‘గుల్ మోహర్’ అందమైన పూల చెట్టు. మా ప్రాంతంలో (జోగులాంబ
గద్వాల జిల్లా) అయితే దీనిని ‘సుంకేసుల చెట్టు’ అంటాం. ఆయా ప్రాంతాల్లో ఇంకా భిన్నమైన పేర్లు కూడా ఉండవచ్చు. ఒకప్పుడు ఈ చెట్టు లేని బడి, కాలేజీ ఉండేది కాదు.
ఇప్పుడైతే అక్కడక్కడ రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. అవి పూసే కాలంలో రోడ్లకు ఎంత
అందమో వర్ణించలేం. గొప్ప అందాన్ని ఇచ్చే ఈ పూలకు అంతే పరిమళం ఉందో లేదో చెప్పలేను. కానీ ఆ పేరుతో వచ్చిన ఈ పుస్తకం నిండా కవిత్వ పరిమళమే. గుల్జార్ కవిత్వ
పరిమళమే.
హిందీ సినిమాలతోనూ, హిందీ సాహిత్యంతోనూ,
అనువాద సాహిత్యంతోనూ పరిచయం ఉన్నవారికి గుల్జార్ తెలిసి ఉండవచ్చు. కానీ నాలాంటి సాధారణ తెలుగు పాఠకుడికి సైతం గుల్జార్ను
చేరువ చేసిన ఘనత మాత్రం వెన్నెల సత్యం గారిదే. గుల్జార్ కవిత్వాన్ని స్వేచ్ఛనువాదం చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చిన సత్యం గారు
వాటన్నిటిని కలిపి ఇప్పుడు ‘గుల్ మొహర్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.
పాద, గణ, మాత్ర నియమాలు అంటూ ఏమీలేని
ఈ మినీ కవితల్లో ఎక్కువ భాగం నానీల లాగే నాలుగు పాదాల్లో నడిచాయి. వీటిని కవి ‘గుల్ మొహర్’ లని పిలిచాడు. ఒక్కో గుల్
మొహర్ కవిత్వ పరిమళాన్ని వెదజల్లే ఒక్కో గుల్
మొహర్ పువ్వే. మచ్చుకు ఈ పుస్తకంలోని మొదటి గుల్ మొహర్ ను చూడండి-
“ముళ్ళను
ఎందుకు
నిందిస్తావు మిత్రమా
నీ పాదాలే వాటిపై ఉంచావు
అవి వాటి చోటనే ఉన్నాయి”
లోకంలో ఎవరికి లేనన్ని కష్టాలు నాకే ఎదురవుతున్నాయి. నాకే ఎందుకిన్నీ
కష్టాలని వాపోతామే కానీ, మన ఏ చేతల వలన, ఏ అచేతనం వలన కష్టాలు వచ్చాయో
ఆత్మ పరిశీలన చేసుకోం. దాన్ని గుర్తుచేసే గుల్ మొహరే కదా ఇది.
మరోకటి-
“కప్పు టీ తోపాటు
పాత కథల్ని పంచుకుంటున్నారు
టీ చల్లారిపోయింది
కళ్ళు తడిగా మారాయి”
ఈ గుల్ మొహర్ లో మనల్ని మనం చూసుకోలేమా! మన జీవితం అద్దంలో దర్శనం ఇచ్చినట్లుగా అనిపించదా! ఇట్లా ఎన్ని కథలని, టీలతో కలిపి, మిత్రులతో పంచుకుని కన్నీళ్ళతో తడిసిపోయిన
జ్ఞాపకాలు మనకు లేవా! ఈ విధంగా ఈ పుస్తకం నిండా నేను, మీరు, మనం, మన అనుభవాలు కనిపిస్తాయి. ఇందులో నిజాలు, నిష్టూరాలు, జీవిత అనుభవాలు,
జీవిత పాఠాలు, పగిలిన హృదయాలు అన్నీ మనకు దర్శనమిస్తాయి. ఇది చదవదగిన పుస్తకం. గుల్జార్
కవిత్వాన్ని తెలుగు వాళ్లకు అందించిన వారి సరసన నిలిచినందుకు, మంచి కవిత్వాన్ని అందించినందుకు వెన్నెల సత్యం గారిని అభినందించాల్సిందే!
మీ స్పందనకు ధన్యవాదాలు సార్
రిప్లయితొలగించండి