9, డిసెంబర్ 2017, శనివారం

కోట రాజశేఖర్

    కోట రాజశేఖర్ అష్టావధానిగా సుపరిచితులు.అంతే కాదు, వారు ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. గణితశాస్త్ర ప్రవీణులు. 1956 నవంబర్ 3 వ తేదిన నెల్లూరు జిల్లా, కోవూరు ప్రాంతంలోని అల్లూరులో జన్మించారు. తండ్రి సారంగపాణి, తల్లి సక్కుబాయమ్మ.

       కోట రాజశేఖర్ ప్రాథమిక విద్యను అల్లూరులోని వేమూరి సుబ్బయ్య పాఠశాలలో, ఉన్నత పాఠశాల విద్యను అల్లూరిలోని రామకృష్ణ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. నెల్లూరులోని మూలాపేట వేద సంసృత పాఠశాలలో విద్యను అభ్యసించారు.  కడప జిల్లా, పొద్దుటూరులోని శ్రీ మళయాళస్వామి ఓరియంటల్ కళాశాల నుండి 2A విద్వాన్ పట్టాను పొందారు. 1977లో పొద్దుటూరులోనే తెలుగు పండిత శిక్షణను పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి 1978 లో  పి.ఓ. ఎల్., 1980 లో  ఎం.ఏ., సంస్కృతం పట్టాలు పొందారు.

       విద్యాభ్యాసం అనంతరం వీరు నెల్లూరు జిల్లాలోని కామిరెడ్డిపాడు, బ్రాహ్మాణక్రాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా విద్యను అభ్యసించారు.    1984 నుండి నెల్లూరు జిల్లాలోని అల్లూరు రామక్రిష్ణ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలలో  సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు.     

     రాజశేఖర్ ఇప్పటి వరకు మొత్తం 36 అవధానాలు చేశారు. నెల్లూరు జిల్లాలోనే 13 అవధానాలు చేశారు.  కావలి, అల్లూరు, రావూరు, కోట, హైదరాబాద్, బుచ్చిరెడ్డి పాలెం, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, కల్లూరుపల్లె, వావిళ్ళ, కడప మొదలగు చోట్ల వారు అవధానాలు నిర్వహించారు. వారి అవధానంలో నిషిద్దాక్షరి, సమస్యాపూరణ, దత్తపది,వర్ణన, ఆశువు, న్యస్తాక్షరి, వారగణితం, మనోగణితం(చిత్రగణితం), ఘంటాగణనం, ఛందో భాషణం, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం అనునవాటిలో సందర్భాను సారం ఎనిమిది ఎంపిక చేసుకొని అవధానలు నిర్వహించారు.

 రచనలు 
అవధాన పద్యమంజరి,
సత్యసాయి భక్తి పద్యమాలిక, షిరిడి సాయి స్తుతి మాలిక వంటి రచనలు చేశారు. దువ్వూరి రామిరెడ్డి పానశాలపై కొన్ని వ్యాసాలు వెలువరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచార పరిషత్ లో ధార్మిక ఉపన్యాసాలు చేశారు.  మా టి.వి.లో దాశరథి శతకంపై కొన్ని ఎపిసోడ్స్ చేశారు.   

 పురస్కారాలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని [[2013]]లో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి 'ఉత్తమ అధ్యాపకుడి ' గా అవార్డు అందుకున్నారు. నెల్లూరు కళాదీప్తి సంస్థ వారు వీరి అవధాన సాహితీ సేవకు గుర్తింపుగా 28.05.2017 నాడు '''అవధాని శేఖర'''  బిరుదును ప్రదానం చేశారు.


2 కామెంట్‌లు:



  1. కలమూ గళమూ కోటగ
    వెలసిరి యూట్యూబులోన వెలుగై వారే
    లలితమగు పద్యముల రే
    డు లబ్జుగన్ రాజశేఖరులిట జిలేబీ !



    జిలేబి

    రిప్లయితొలగించండి