" ఇన్ని సరిపోవా? మరొకటెందుకు? అని ఏ కాలంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఏ జీవైనా ప్రశ్నించుకొని " పోతవి" అని
సరిపుచ్చుకొని, "అవసరంలేదు" అని జవాబు చెప్పుకొని ఉంటే ఏక కణ జీవుల నుండి మానవావతరణ దాకా జీవపరిణామం
జరిగి ఉండేదా ? రాతి యుగం నుండి రాకెట్ యుగం దాకా మనిషి ప్రస్థానం సాగి ఉండేదా? ప్రకృతి పరిణామ శీలమైనది. భాషా అంతే. కవిత్వమూ
అంతే. కవిత్వ నిర్మాణామూ అంతే.
" నానీలు, రోనీలు , పూరీలు, రెక్కలు, తొక్కలు...
ఇన్ని సరిపోవా? మరొకటెందుకు?'
అని కొత్త కవిత్వ నిర్మాణాల మీద మన అయిష్టతను
, అసహ్యాన్ని ప్రకటించినంత
మాత్రనా అవి ఆగిపోవు. ఎంతగా అంటే ఇన్ని ప్రశ్నలేసినవారి చేతనే గుగాగీలు, ఫన్నీలు మొదలైన కొలతల కవిత్వం రాయించెంతగా. నానోలు,
నీనాలు, బఠాణీలు, చినుకులు, ఫన్నీలు,
నూరాలు ఏవైనా కావొచ్చు. ఏ పేరుతోనైనా
రావొచ్చు. ఏ రూపంలోనైనా రావొచ్చు. కవిత్వమై, కవిత్వానికి చేటుతేకపొతే మనకు అభ్యంతరమేమున్నది?
సజీవ భాషకు మార్పు తప్పనట్లే, సజీవ కవిత్వానికీ రూప పరిణామం తప్పదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చరిత్ర పరిణామ క్రమంలో ఏ రంగంలోనైనా, ఏ మార్పైనా అప్పటి పరిస్థితులు, అప్పటి అవసరాలకు అనుగుణంగా జరిగినవే.
కవిత్వానికీ అంతే. కాబట్టే నన్నయ కాలం నుండి రాజ్యమేలిన ఇతిహాసాలు, పురాణాలను కాదని 16 వ శతాబ్ధిలో ప్రబంధాలు వెలిశాయి.
ప్రబంధ కన్యల అంగాంగ వర్ణనలతో విసిగి వేసారిన తెలుగు పాఠకులకు అధునిక కాలంలో ఖండ
కావ్యాలు ఊరటనిచ్చాయి. ఇన్ని సరిపోవా?
అని గురజాడ ప్రశ్నించుకొని, ముత్యాల సరాలు అల్లకపోయి ఉంటే తెలుగు కవితామ
తల్లి మెడెంత బోసి పోయి ఉండేదో వేరే చెప్పాలా? గురజాడ
సృష్టించినదే అయినా ఆ మార్గంలో మరో ప్రపంచానికి దారి చూపుతూ మహా ప్రస్థానానికి
మనల్ని సన్నధ్ధం చేస్తూ, నదీ నదాలు, కొండలు, అడవులు, ఎడారుల గుండా
తన చెర్న కోల గేయాలతో శ్రీశ్రీ తరుమకపోయి ఉంటే ఎముకలు కుళ్ళి,
వయసు మళ్ళి తెలుగు కవిత్వం ఏ మురికి
కూపంలోనో మురిగి చచ్చేది కాదా! గాలి నాసర
రెడ్డి, ఇస్మాయిల్ లాంటి కవులు
జపనీ హైకూల వైపు దృష్టి సారించకుండా ఉండి ఉంటే తెలుగు కవిత్వానికి తాత్విక దృష్టి
అంధత్వం సంభవించేది. గోపి నానీలకు నాన్నే కాకుంటే శతకోటి కవి గోపాలులలో ఒక
గోపాలుగానే మిగిలిపోయేవాడే. అంతే కాదు తెలుగు కవిత్వంలో ఎస్. రఘు, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, శిరీషా, నల్లా నరసింహ మూర్తి, ఎస్. అర్. భల్లం , సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అంబల్ల జనార్ధన్
లాంటి నానీ కవుల అడ్రస్సూ
గల్లంతయ్యేదే. గద్దర్, వంగపండు,
నాజర్, శివసాగర్, గళాల్లో పాట తూటై పురుడు పోసుకోకపోయింటే తెలుగు కవిత్వ కారడవి గర్జించకుండా ఆకులు
రాల్చుకుని చిగురించకుండా ఇప్పటికీ
మోడుబారే ఉండేది. అంతెందుకూ,
పద్యాల నడుములు ఇరగదన్ని కుందుర్తి చేత అవతరించబడిన, ఏ కొలతలు అక్కరలేనిదని ఇప్పుడు మనమంతా విరివిగా
రాస్తున్న వచన కవిత్వానికీ ఏదో ఓ కొలత
ఉండబట్టే అది వచనం కాకుండా బతికిపోయిందన్నది వాస్తవం కాదా!
సజీవ కవిత్వం కాలానికి అనుగుణంగా తన
రూపాన్ని తానే ఎంచుకుంటుంది. అది ఏ రూపంలో
ఉందన్నది కాదు ముఖ్యం. అది కవిత్వం కావడం ముఖ్యం. ఏ ప్రయోజనాన్ని ఆశించి
అవతరించిందో దాన్ని సాదించటం ముఖ్యం. ఎవరైనా, ఏ పేరుతోనైనా, ఏ నియమాలతోనైనా, ఏ కొత్త ప్రక్రియనైనా సృష్టిస్తే మనకు
అభ్యంతరమేమున్నది? ఆ మాటకొస్తే మన అభ్యంతరాల మీద దాని మనుగడ అధారపడదు.
దాని యోగ్యత మీద తప్ప. నిజంగా అది సమర్థత, ప్రయోజనీయత కలిగినదే అయితే అది కచ్చితంగా నిలబడగలుగుతుంది. తనకో
స్థానాన్ని సృష్టించుకొంటుంది. కొంత మంది అనుచరులను ఏర్పరుచుకొంటుంది. తన అవసరం
తీరిపోయాక తనను తానే మరో రూపంలోకి మార్చుకుంటుంది. అంతే కాని ఎవరి దయా దాక్షిణ్యాల
మీదో అది ఆధారపడదు.
ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే... తెలుగు
కవిత్వానికి కీడు చేయని నిరంతర ప్రయోగాలకు, నూతన ఆవిష్కరణలకు మన మనసు ఒప్పకపోతే, అలాంటి ప్రయత్నాలకు నిర్మాణాత్మక సూచనలిచ్చి ,
అండగా నిలబడాలని, అశీర్వదించాలని మన మనసు అంగీకరించకపోతే ఎవరికీ ఏ అభ్యంతరమూ
ఉండదు. అవహేళన చేస్తూ , అవరోధంగా
నిలబడితేనే ... వర్ధమాన కవులకూ, తెలుగు
కవిత్వానికీ చేటు తెచ్చిన వారిగా చరిత్రలో
మిగిలిపోక తప్పదు. ఇది తెలుగు కవిత్వానికి ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని
గుర్తెరుగడం తప్పా, మనం చేసే
మేలు మరేమి లేదు.
-
నాయుడుగారి జయన్న
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి