ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన భక్తిపూర్వక నివేదన శతకం.
తన మనోభావాలను అక్షరరూపంలో వ్యక్తంచేసి సమాజంలో చైతన్యాన్ని నింపేవాడే నిజమైన కవిగా పరిగణింపబడతాడు. ఎందరో కవులు వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కాలం ఎంత మారినా మంచి పునాది గల పద్యరచన ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక దృక్పథంతో భక్తిపూర్వక నివేదనగా పండితపామర ప్రశంసల నందుకొన్న చక్కని గ్రంథం శ్రీ నాయుడుగారి జయన్నగారు రచించిన పవనపుత్ర శతకం.
ఈ కవి జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురం అను గ్రామంలో శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీయుత గోపాలనాయుడు దంపతులకు జన్మించి , పెద్దమ్మ శంకరమ్మ కడ పెరిగి శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించి ఎం.ఏ., బి.యిడి., పట్టాపుచ్చుకొని ఉత్తమఉపాధ్యాయుడుగా పేరుపొందారు. దృక్కోణం(వ్యాసములు),నడిగడ్డ(దీర్ఘ కవిత) వంటి రచనలతో సాహితీ లోకంలో ప్రశంసలు పొందారు. వీరి బాల్యం పెద్దమ్మ గారి ఊరయిన పల్లెపాడులో గడిచింది. ఆ ఊరిలో గల ఆంజనేయస్వామి గుడిప్రాంగణంలో మిత్రబృందంతో తిరిగినందువలనను, కొత్త ఊరిలోను, ఉద్యోగము చేసిన బీచుపల్లిలోను ఆంజనేయుని గుడులు ఉన్నందువల్ల వీరికి ఆంజనేయస్వామిపై భక్తి కుదిరింది. అనంతరకాలంలో తనకు కలిగిన అనుభవాలు , ఆవేదనలూ, సమాజంపట్ల తనకున్న అభిప్రాయాలను ఆంజనేయస్వామికి చెప్పుకోవాలని భావించి చక్కని ఆటవెలది పద్యములతో ఒక శతకాన్ని రచించారు. తను పెరిగిన ఊరిపేరును కలిపి 'పల్లెపాటి వాస పవనపుత్ర ' అనే మకుటంతో ఆ స్వామికి తన భావాలను నివేదించి దీవెనలు కోరుతూ సామాజిక మార్పును అభిలషించారు.
ఈ శతకంలో సామాజిక అంశాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. పేద ధనికులమధ్యగల వ్యత్యాసాలు పేర్కొంటూ ఉన్నవారు లేనివారికి సహాయపడాలని సలహా ఇచ్చారు. కులాలు మతాల పేరుతో నేటి పాలకులు ప్రజలను వంచించి గద్దెనెక్కుతున్నారని, కూటికి లేని వాణ్ణి గమనించడంలేదని బాధపడ్డాడు. చదువు రాని మొద్దులకు రాజకీయం రాచబాట అయ్యిందని, కాసులున్నవాడు ఏదిచేసినా చెల్లుతూ ఉన్నదని నేటిసమాజాన్ని చూచి బాధపడతాడు.
"కులము పేరు జెప్పి బలము పెంచుకొనుచు
మతము పేరు జెప్పి మాయజేసి
గద్దె నెక్కి కులుకు మొద్దులున్నరు జూడు' అని నివేదిస్తూ,
కూడు లేక నొకడు కూలిపోవుచునుండె
రాజులాగ నొకడు రాలుచుండె
రాత దులిపి మంచిగీతగీయవ సామి! (34,35 పద్యాలు) అని పేదలబతుకులనుమార్చుమని స్వామిని అభ్యర్ధించారు.
ఉన్న ఊరును వలె మాతృభాషను గూడ చక్కగా ప్రశంసించారు.
అమ్మ పాలలోని కమ్మదనంబును
తేనెకన్న మించు తియ్యదనము
తెలుగు బాస గాక దేనిలో నుండురా
పల్లె పాటి వాస పవన పుత్ర (3)
అని కమ్మగా మాతృభాషయైన తెలుగును వర్ణించాడు.
పద్యకవితయైనా, గద్యకవితయైనా సమానంగా ఆదరించాలని కవి పాఠకులకు సందేశమిచ్చాడు. "పద్యమనుచు కవులు పలుచజేయ వలదు
వచన కవిత యనుచు వంత వద్దు
దేని ఘనత జూడ దానిదే లోకాన" అని పద్యగద్యములకు సమాన ప్రాధాన్యత నిచ్చారు.
లోకంలో నేడు మంచివారికంటె చెడ్డవారు అధికంగా ఉన్నారని చెబుతూ మంచినీటికంటె ఉప్పునీరు ఎక్కువగా ఉంటుంది గదా అని దృష్టాంతం తో సమర్థించారు.(4) కోపం గర్వం పనికిరానివని, చింత మనిషిని దహిస్తుందని, త్రాగుడుకు బానిసకావద్దని, బాలల్లో బ్రహ్మ ఉన్నాడని,ధనంకంటె గుణంగొప్పదని వ్యక్తిత్వవికాసలక్షణాలను పేర్కొన్నాడు. వ్యావహారిక పదాలను ప్రయోగిస్తూ భాషను సామాన్యజనులకు చేరువజేశాడు. సంపద ఉన్నపుడు భగవంతుడుగుర్తుకురాడని తెలుపుతూ ఈ సమాజాన్ని మార్చిఅందరినీ చల్లగా చూడు స్వామీ! అని ఆ పవనపుత్రుణ్ణి అభ్యర్థించాడు.
మొత్తమ్మీద ఈ శతకం సమాజహితాన్ని కాంక్షిస్తూ నీతి బోధకంగా అలరారుతూ ఉంది.
ఈ గ్రంథమును చదివి, ముందు మాటవ్రాసి, ఆశీర్వదించి, ముద్రణకు తోడ్పడిన ప్రముఖ పద్యకవులు అవధానులు శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాదములు సమర్పిస్తూ ఈ కవి, భక్తిపూర్వకంగా ఈ కృతిని వారికి అంకితమియ్యడం హర్షించదగ్గ విషయం.
ఆంజనేయస్వామి వర్ణముఖచిత్రంతో, ఆటవెలది సొగసులతో, అందమైన పలుకుబళ్ళతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతి ఒక్కరు దీనిని చదివి, ఆనందించి, ఆచరించగలరని ఆశిస్తున్నాను.
రచనలో ఈ కవి మరింత ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నాను.
- డాక్టర్ చీమకుర్తి వేంకటేశ్వరరావు,
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, నెల్లూరు