19, జనవరి 2020, ఆదివారం

సమస్యాపూరణం










పలువురు మెచ్చు రీతిన యపప్రద లేక యభంగ వీరులై
నిలిచిరి రాజు లిచ్చట, అనింద యపూర్వ కవిత్వ సంపద
న్నిలిపిరి తారలై సుకవు లెందరొ, వారసులై యబద్దమున్
పలుకరు రాణ్మహేంద్ర పుర వాసులు, సత్యము నెన్న డేనియున్

27, నవంబర్ 2019, బుధవారం

మేం మనుషులమేనా?


అమ్మా!
మేం గుండెలేని మొండి మనుషులం
కరుణలేని కఠినాత్ములం
అనంత పాపపంకిలంలో మునిగితేలుతున్న పాపాత్ములం
మీరు చస్తేనే చలించలేదు
ఈ కన్నీళ్ళకు కరిగిపోతమా?
మీరు మాలాగే బండగా బతకడం నేర్చుకొండి
మీ కష్టాలు మీవే
మీ కన్నీళ్ళు మీవే
మీ బతుకు ఇక్కడ ఎవరికి కాబట్టింది కనుక
ఎవడి పనుల్లో వాడున్నాడు
తోడొచ్చే ఉద్యోగులు ఎక్కడ తొంగొని ఉన్నారో ఎవరికి ఎరుక?
ఏసిన మెతుకులు ఏరుకోవటంలో కొందరు బిజీ
ప్రభువుల పల్లకీ మోయడానికి కొన్ని భుజాలు రెడీ
భజనలు, బాకాలు సరేసరి
న్యాయదేవత కళ్ళకు గంతలుండటం పాతమాట
నోటికి కూడా ఇప్పుడు కొత్త మూత
అందుకనే అటువైపు చూడకండి
మేము మనుషులమన్న మాట మర్చిపొండి
పైనున్నాడో లేదో తెలియదు
ఉన్నా లేకున్నా మీ ఉసురైతే ఊరికే పోదు
అది చూడడానికైనా అగండి
అది చూడడానికే బతుకండి.
- ఎన్. జయన్న

12, అక్టోబర్ 2019, శనివారం

ప్రగతిచక్రాల కింది ఖాకీ


ఉడికీఉడకని మెతుకులు
ఉప్పుడికిన బట్టలు
హీటెక్కిన కాళ్ళు
నిద్రకు నోచని కళ్ళు
హూనమైన ఒళ్ళు
గతుకుల రోడ్డుపై పయనం
సీట్లపైనే శయనం
రోజూ ఏదో ఒక యుద్ధం
తప్పదు అనునిత్యం.
వాన, చలి, ఎండ
కాలం ఏదైనా
కదలక తప్పని బతుకుచక్రం.
ఆగిపోతే చేరుటెట్లా గమ్యం?
- ఎన్. జయన్న

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

గద్వాల పిజి సెంటర్




* గద్వాల పిజి సెంటర్ కు మంచి రోజులు
* సిద్దమవుతున్న వసతి గృహాలు
* విద్యార్థులకు తప్పనున్న అవస్థలు

        గద్వాల పిజి సెంటరు ప్రగతికి  ప్రధాన అవరోధమైన వసతి గృహాల సమస్య త్వరలో తీరనున్నది. స్త్రీ, పురుషులకు రెండు వసతి గృహాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి.  కృష్ణానది తీరాన 17 ఎకరాల సువిశాల సుందర స్థలంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన పిజి సెంటర్లో  అధ్యయన కేంద్రం, వసతి గృహాల సముదాయం ఇక విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వసతి గృహాలు ఏర్పాటుకావడం వలన ఇక్కడి పిజి సెంటర్లోని కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని కొత్త కొర్సులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా అక్షరాస్యతలో వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం విద్యలో పురోగతి సాధించగలదని ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.
   1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎం.సి.ఏ., ఎం.కాం., కోర్సులతో గద్వాల పట్టణంలో పిజి సెంటర్ ఏర్పడింది.  పట్టణంలోని డి.కె. సత్యారెడ్డి బంగ్లాలో మొదట్లో తాత్కాలికంగా నిర్వహించారు. నదీ అగ్రహారం దగ్గర పిజి సెంటర్ నిర్మాణం అయ్యాకా పట్టణం నుండి అధ్యయన కేంద్రం అక్కడికి చేరింది.  కొంత కాలం పాటు పట్టణం పిజి విద్యార్థులతో కళకళలాడింది. తదనంతర కాలంలో ఎం.సి.ఏ., కోర్సుకు డిమాండ్ తగ్గడంతో విద్యార్థులు ఎవ్వరూ ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోవడంతో మూతపడింది. దానితో  కేంద్రంలోని కంప్యూటర్లు, ఇతర సామాగ్రి పాలమూరు విశ్వవిద్యాలయానికి తరలించారు. గద్వాలకు పిజి సెంటర్ వచ్చినట్లే వచ్చి, దూరమైపోయింది.  దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతానికి ఒక దశాబ్దం పాటు ఆ విధంగా స్నాతకోత్తర విద్య దూరమయ్యింది.
అనేక అందోళనలు, అనేక పరిణామాల అనంతరం తిరిగి 2013 సంవత్సరంలో పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పునఃప్రారంభమైంది. విద్వద్గద్వాలగా పేరొందిన ప్రాంతం కావడం, సాహిత్యంతో విడదీయరాని అనుబందం కలిగిన ప్రాంతం కావండంతో   ఎం.ఏ., (తెలుగు) కోర్సుతో పునఃప్రారంభించారు. దీనితో పాటు ఎం.ఏ., (ఆంగ్లం), ఎం.కాం., కోర్సులు కూడా ప్రారంభించారు. పిజి సెంటరులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 ఆరుగురు అకాడమిక్ కన్సల్టెంట్లు, ఇద్దరు పార్టు టైం ఉపన్యాసకులు పనిచేస్తున్నారు.  సాఫీగా సాగుతున్న కళాశాల ప్రయాణంలో మళ్ళీ కుదుపులు.  సరైన వసతులు లేవని, రవాణా సౌకర్యం లేదని, వసతి గృహాలు లేవని విద్యార్థులు చేరటం తక్కువైంది. చేరిన వారు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళడం సాధారణమైంది.  విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అసలు చేరటం లేదని తెలుగును పాలమూరు సెంటరుకు, ఆంగ్లాన్ని  కొల్లాపూరు సెంటరుకు మార్చాలని  ప్రయత్నాలు జరిగాయని అంటారు.  విద్యావంతులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో  ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని అంటారు.  కళాశాల ప్రస్తుతం సాఫీగా సాగుతుంది. 
స్త్రీలకు, పురుషులకు రెండు వసతి గృహాలు నిర్మాణమవుతున్నాయి.  ఇవి పూర్తైతే మరిన్ని కొత్త కోర్సుల ఆగమనంతో కళాశాల  విద్యార్థులతో కళకళలాడుతుంది.  వెనుకబడిన ప్రాంతానికి స్నాతకోత్తర విద్య మరింత అందుబాటులోకి వస్తుంది.  నడిగడ్డ ప్రాంత విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రగతి బాటలో నడవాలని ఆశిస్తున్నాను.
-ఎన్. జయన్న


పురుషుల వసతి గృహం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  
  

                          స్త్రీల వసతి గృహం