4, డిసెంబర్ 2013, బుధవారం

మా పాలమూరు కవులు -ఎలకూచి బాల సరస్వతి



ఎలకూచి బాల సరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం ఇక్కడే.  నెల్లూరు జిల్లా పొదిలి తాలుకాలోని ఎడవిల్లి అగ్రహారం వీరి జన్మస్థానం. వీరు కొంత కాలం విజయనగరంలో గడిపారు. తరువాత తెలంగాణలోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి,  సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని . వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ  అక్కడే స్థిరపడిపోయాడు.
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు ' ఎలకూచి వెంకటకృష్ణయ్య '.బాల్యంలోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది.  వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మొదటి కవి మహోపాధ్యాయుడుగా బాలసరస్వతికి పేరుంది. ఆరు భాషలలో పండితుడు. ' షడ్భాషా వివరణము ' అనే వీరి గ్రంధం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం, బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు విజయనగరంలో ఉండిన కాలంలోనే నన్నయ రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు నన్నయ పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత  త్ర్యర్థి కావ్యంగా ' రాఘవ యాదవ పాండవీయం ' అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు భీముడు, కాశీరాజు కూతురు నాయకా, నాయికలుగా ' చంద్రికా పరిణయం ' అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి సురభి మాధవరాయల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని తెలుగు చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే. మాధవరాయల తండ్రిగారైన మల్లానాయుడి పేరు మీదగా 'మల్ల భూపాలీయం ' గా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు. ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. ' సురభి మల్లా! నీతి వాచస్పతీ!'  మకుటంతో నీతి శతకాన్ని, ' సురభి మల్లా! మానినీమన్మథా!' మకుటంతో శృంగార శతకాన్ని, 'సురభి మల్లా! వైదుషీ భూషణా!" మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం.  ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి  రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా జటప్రోలు సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే,  బాలసరస్వతికీ  జటప్రోలు సంస్థానం  గౌరవాన్ని చేకూర్చింది.

                                                            @@@

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి