12, డిసెంబర్ 2015, శనివారం

మరుగున పడుతున్న మన ఆటలు - పులి జూదం

పులి జూదం అనునది విశేష ఆదరణ గల ఒక గ్రామీణ క్రీడ. ఇది చదరంగం వలె ఆడు ఆట. ఒకనాడు పల్లెల్లో మేధావి తనానికి నిరూపణగా ఆటను ఆడేవారు. గ్రామీణ ప్రాంతాలలో, విరామ సమయాలలో నేటికీ ఆటను ఆడటాన్ని చూడవచ్చు. గ్రామ కూడలిలో, రచ్చబండ దగ్గరో, మరో చెట్టుకిందో, దేవాలయపు కట్టల మీదో, ఇంటి అరుగుల మీదో, ఎక్కడో ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ప్రాంతంలోనైనా ఆట ఆడుతూ పల్లెల్లో జనాలు కనిపిస్తారు.
1:3 పులి జూదం
ఆట ఆడుటకు కావలసినవి...
1. పులి జూదం చిత్రం
2. నాలుగు గచ్చకాయలు.
3. పద్దెనిమిది చింత బిచ్చలు.
    పులి జూదం చిత్రం రెండు  అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి(విశేష ఆదరణ పొందిన 3 వ రకం ఆట గురించి...)  పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు(చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.


 ఆటగాళ్ళ సంఖ్య 
ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.

3:15  పులి జూదం
 ఆట నియమాలు 
1.పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
2. ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల(పులుల)తో, మరొకరు చింతబిచ్చల(మేకల)తో ఆడాలి.
3. త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.

4. ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.

5. పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.

6. ఈ విధంగా 18 (18:4;15:3;1:3)మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో  ఆడేవాడు  జరుపుతూ పోతాడు.

7.తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది.
8. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు.

4:18 పులి జూదం


పులి జూదం రకాలు

పులి జూదంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఆటను ఆడే చిత్రాన్ని బట్టి, ఆడే గిల్లల సంఖ్యను బట్టి రకాలు ఉన్నాయి.

) 1 పులి పులి జూదం: ఆడటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఆటను ఆడుతారు. చాలా తక్కువ సమయంలో ఆట ముగుస్తుంది. మూడు మేకలతో పులిని కట్టడి చేస్తారు. చేయలేకపోతే పులితో ఆడేవారు గెలిచినట్లు. ఆట తెలుగు ప్రాంతాలు అన్ని చోట్లా ఆడిన దాఖాలాలు ఉన్నాయి.

) 3 పులులు పులి జూదం: ఆటను 3 పులులు, 15 మేకలతో ఆడుతారు. ఆటను ఉత్తర సర్కారు జిల్లాలలో ఆడుతారు.

) 4 పులుల పులి జూదం: ఆటలో 4 పులులు, 18 మేకలతో ఆటను ఆడుతారు. ఆట దక్షిణ తెలంగాణాలోను, రాయలసీమలోనూ చూడవచ్చు

ఆట ప్రాచీనత:
  ఆటలు కాకతీయుల కాలం నాటివని తెలియుచున్నది. ( సురవరం ప్రతాప రెడ్డి: ఆంధ్రుల సాంఘీక చరిత్ర, ఓరియంట్ లాఙ్మ్న్ ప్రచురణ, 1996, పుట-130). తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్త్రుతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి.      

కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఒక చోట ...

"తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ సాగటాల నే నతి ప్రౌఢుండన్.(కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక, రెండవ భాగం, పుట-85./ ఆంధ్రుల  సాంఘీక చరిత్ర, పుట-132 )
  పుస్తకంలో కవి మూడు రకాల పులి జూదములు కలవని గోపరాజు పేర్కొన్నట్టు ప్రతాపరెడ్డి చెప్పాడు.(పుట-132). అవి ఒక పులి జూదం, నాలుగు పులల జూదం. మూదవది స్పస్టంగా పేర్కొనలేదని ప్రతాపరెడ్డి చెప్పాడు. అయితే మూడవ ఆటపై సందిగ్థతలో ఉన్నప్పుడు రెడ్డికి సికింద్రాబాద్లోని మారేడుపల్లి వాసి తాడేపల్లి కృష్ణమూర్తి 3 పులుల ఆటను  సూచించినారు.  
మారుతున్న కాలంలో విడియో గేంస్, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే పిల్లలకు మరుగున పడుతున్న మన ఆటలను పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చదరంగానికి విధంగానూ తీసిపోని ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుదనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు