30, నవంబర్ 2013, శనివారం

మా పాలమూరు కవులు - ఇక్బాల్ పాషా



ఇక్బాల్ పాషా అను ఈ కవి, రచయిత మహబూబ్ నగర్ జిల్లా   కొల్లాపూర్ కు చెందినవారు. వీరి తల్లిదండ్రులు ఖాజాబీ, మహ్మద్ ఇబ్రహీం సాహెబ్. ఇక్బాల్ గారు 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గద్వాల మండలం అనంతాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గద్వాలలో స్థిరపడ్డారు.




కథకుడిగా ఇక్బాల్ 
కళాశాలలో చదివే రోజుల నుంచే సాహిత్య రచనను మొదలు పెట్టారు. 1977 లో 'ఎవరికి సొంతం వాడిన వసంతం' పేరుతో మొదటి కథను రాశారు. 1992లో 'ఆటా' వారు నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ' ఎటు చూసినా వాడే ' కు ప్రత్యేక బహుమతి వచ్చింది. అమెరికా నుండి వెలువడే ' అమెరికా భారతి ' లోనూ ఈ కథ అచ్చయింది. వీరి కథలన్నీ సామాజిక సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై రాసిన ' కాల్వ మింగిన ఊరు ', పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ' కఫన్ ' కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011 లో కఫన్ అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. విరసం వారి 'కథల పంట' లో, ప్రజా సాహితీ, అరుణతార పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి.
కవిగా ఇక్బాల్ 
1977 లో తొలిసారి 'దేవుడికో లేఖ' పేరుతో దీర్ఘ కవిత రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం రాష్ట్ర మహాసభలలో స్పందన పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. దీనిని అప్పటి విరసం సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన సాగర్ గారు ఆవిష్కరించారు. వీరి 'తుఫాను ' కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటిలో మొదటి బహుమతి వచ్చింది. ' జర్మినేషన్ ' పేరుతో వీరు రాసిన కవిత స్కైబాబా గారి సంపాదకత్వంలో వెలువడిన ' మునుమ 'లోనూ చోటు దక్కించుకుంది. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఉత్తమమైన ఓ 88 కవితలతో సేద్యం పేరుతో ఓ కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. పాలమూరు అధ్యయన వేదిక కు జిల్లా భాధ్యులుగా పని చేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పని చేస్తున్న ఇతర కవులు పరిమళ్ , ఉదయమిత్ర లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు,కవితలతో కలిపి ఓడిపోలే...పల్లె అను పుస్తకాన్ని వెలువరించారు. ఇంకా బాల గేయాలు, కరువు పాటలు, ఉపాధ్యాయ ఉద్యమ గీతాలు కూడా రాశారు. 
నటుడిగా ఇక్బాల్ 
వీరు రంగస్థల నటులు కూడా. ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ శరబందరాజు గారి ఆధ్వర్యంలో వీరు 'గరిబీ హటావో' నాటకంలో మొదటి సారి నటించారు. విద్య, ఇంకా తెల్లారలే, కోడిపిల్లలొచ్చె మొదలగు వీధి నాటకాలలోనూ వీరు నటించారు.







--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


27, నవంబర్ 2013, బుధవారం

మా పాలమూరు కవులు - పరిమళ్




 



మహబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పత్రిక, ప్రస్థానం, ప్రగతి, సోయి, ప్రజాసంసృతి, అరుణతార వంటి పత్రికలలో, పాలమూరు గోస, గ్లోబల్ ఖడ్గం, మా ఊరు, జనకవనం. గుజరాత్ గాయం, ప్రపంచీకరణ ప్రతిధ్వని వంటి ఆభ్యుదయ సాహిత్య సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశారు. విరసం వారు వెలువరించిన 'కథల పంట' లో వీరి కథకు స్థానం దక్కింది. 2005 లో 42 కవితలతో మట్టిగంప కవితా సంకలనాన్ని వెలువరించాడు. కొన్ని కవితలు, కొన్ని వ్యాసాలతో కలిపి 'డెడ్డెనకనక' అను పుస్తకాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో, డా. బి. కేశవులు గారి పర్యవేక్షణలో పాలమూరు జిల్లా వచన కవిత్వం - ఆర్థిక, సామాజిక విశ్లేషణ అను అంశం మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం మాగనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. పాలమూరు స్థితి గతులలో మార్పు కోసం గత కొంత కాలంగా ఉద్యమిస్తున్న పాలమూరు అధ్యయన వేదిక లో భాగస్వాములు. ఈ వేదికలోని ఇతర సోదర కవులు ఉదయ మిత్ర, ఇక్బాల్ పాష లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ అను చిన్న కవితా సంకలనాన్ని వెలువరించాడు.

 ---------------------------------------------------------------------------------

ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



 

26, నవంబర్ 2013, మంగళవారం

ఆటవెలది

ఎదురు జెప్ప కుంటె యెడ్డోడు మంచోడే
మారు మాట లాడు మనుజుడెడ్డె
తనదు దప్ప నరుడు ధర్మ మెందు కనడు
జగతి తీరు యిదియె జాబిలమ్మ!

25, నవంబర్ 2013, సోమవారం

నా యాత్రానుభవాలు-3, హోస్పేట్






13.10. 2013

రా. 10. 30 గం. లకు మురుడేశ్వర్ నుండి హుబ్లీకి బయలుదేరాం. తెల్లవారుజామున 3 గ.లకు హుబ్లికి   చేరుకున్నాం.  హుబ్లి నుండి గదగ్, అక్కడి నుండి బయలుదేరి ఉ. 8 గం. లకు  హోస్పేట్ కు చేరుకున్నాం. పట్టణంలోకి వెళ్ళకుండా, ఊరి బయటే డ్యాం దగ్గరే బస్ దిగి డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం కు ముందు పచ్చటి పార్క్ ఒకటి మనకు ఆహ్వానం పలుకుతుంది. పార్క్ నుండి, మరియు ఎగువ భాగాన కొండ పక్కల దారి వెంట కూడా  డ్యాం కు చేరుకోవచ్చు. కొండ పక్కల దారి వెంట డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం దగ్గరలో కుడివైపు దిగివ కాలువలో  స్నానాదికాలు కానిచ్చి, డ్యాం దగ్గరకు వెళ్ళాం.
  కర్ణాటక లోని బళ్ళారి జిల్లాలో హోస్పేట్ దగ్గర తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ  డ్యాం చూపరులను ఆకట్టుకుంటుంది. నీటి పారుదల అవసరాలు,  విద్యుత్ ఉత్పత్తి, వరదల నివారణ కొరకు బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ గా  1945 లో మద్రాస్ ప్రెసిడెన్సీ, నిజాం సర్కార్లు ఉమ్మడిగా నిర్మించ తల పెట్టగా,  1953 లో కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వాలు ఉమ్మడిగా పూర్తి చేశాయి. కనుచూపు మేర విస్తరించిన అతి పెద్ద జలాశయం మనసును నీటి అలల్లో ముంచి తేల్చుతుంది. తుంగభద్ర నదిపై ఇదే అతి పెద్ద జలాశయం. 423 TMC నిల్వ సామర్థ్యం కలిగి, 35.36 మీటర్ల ఎత్తుతో, 2,449 మీటర్ల పొడువు కలిగి నీటిని నిల్వచేస్తుంది.  అప్పటి మద్రాస్ ఇంజనీర్ డా. తిరుమలై అయ్యంగారు ఈ డ్యాం రూప శిల్పి. వారి విగ్రహాన్ని జలాశయానికి అనుకొని ఉన్న పార్కులో చూడవచ్చు. ఈ డ్యాం నుండి వదిలె ఎడమ కాలువ నీరు పూర్తిగా  కర్ణాటక అవసరాలకు వినియోగం కాగ, కుడి వైపు నిర్మిచించిన రెండు కాలువలు ( ఎగువ కాలువ, దిగువ కాలువ ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ  డ్యాం కు కుడివైపు సండురు కొండ ఉంది. దాని మీదికి వెళ్ళి చూస్తే  డ్యాం అందాలు మరింత రమణీయంగా కనిపిస్తాయి.
  డ్యాం పై భాగంలో అందాలన్ని దర్శించాక అక్కడ ఓ క్యాంటిన్ లో టీ తాగి , డ్యాం ముందు, దిగువలో ఏర్పాటు చేసిన పార్క్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని, బయటకు నడిచాం. బయటకు వచ్చే దారిలో పార్క్ లో జల విహారానికి చిన్న సైజు బోటింగ్ ఏర్పాటు ఉంది. కాసేపు అక్కడ ఆగి, పట్టణం వైపు వెళ్ళిపోయాం.  
  మ. 12 గం. లకు హోస్పేట్ పట్టణ బస్ స్టాండ్ కు చేరుకున్నాం - హంపికి వెళ్ళే యోచనతో...


                                                     - నాయుడుగారి జయన్న

19, నవంబర్ 2013, మంగళవారం

పదనిసలు

జీవితం
పుట్టుకతో పుడమి పైకి అరంగేట్రం
మృత్యువుతో మట్టిలోకి మహాభినిష్క్రమణం

స్నేహం
ఒంటరి తనానికి ఒక జోడు
కష్టసుఖాలలో ఒక తోడు

ప్రేమ
ఆస్వాదిస్తే అమృతం
విఫలమైతే విషం

లోకం
నవ్వు - ఏడ్పిస్తుంది
ఏడ్చు- నవ్విస్తుంది

గడ్డి
నీతితో పశువులు మేసేది
అవినీతితో మనుషులు బొక్కేది

నిజం
దాచేస్తే దాగని నిప్పు
అబద్ధంతో దాన్ని దాచుట తప్పు

- నాయుడుగారి జయన్న


15, నవంబర్ 2013, శుక్రవారం

ఆటవెలది

పలుకులుంటె చాలు పసిడి దేనికిరయ్య ?
తిమ్మి బమ్మి జేయ తిండి దొరుకు
నాగరికపు మనిషి నాటక మిట్లుండు
జయుడి మాట నిజము జాబిలమ్మ!

                          -  నాయుడిగారి జయన్న

10, నవంబర్ 2013, ఆదివారం

ఆటవెలది

ఎదుటి వాడి గుణము యెంచవలదు, మన
తీరు బట్టి వాడు తిరుగుచుండు
అద్దమందు జూడ నగుపించదన్యంబు
జయుడి మాట నిజము జాబిలమ్మ!

9, నవంబర్ 2013, శనివారం

నా యాత్రానుభవాలు - 2, మురుడేశ్వరం


      జోగ్ జలపాతం చూశాక మురుడేశ్వరం వెళ్ళాలని   నిర్ణయించుకున్నాం. మురుడేశ్వరం వెళ్ళాలంటే ముందుగా హనవర వెళ్ళాలని చెప్పారు- అక్కడ విచారిస్తే.   అయితే హనవర   వెళ్ళడానికి వచ్చే బస్,ఇక్కడికి  రావడానికి మరో గంట సమయం ఉందంటే   దగ్గర్లోనే ఉన్న అందమైన లొకేషన్లు చూడటానికి,  జలపాతంగా మారడానికి ముందు శరావతి నది నడక చూడటానికి ఓ రెండు కిలోమీటర్లు కాలి నడకన బయలుదేరాం.
ఎటు చూసినా అందమైన కొండలు, వాటి మధ్య శరావతి నడక, దానిని దాటటానికి ఎత్తైన వంతెన, కనుచూపు మేర పచ్చదనం. వర్ణించడానికి  మాటలు చాలవు.
రమణీయమైన ఆ ప్రదేశంలో  కాసేపు స్వేచ్చా విహాంగాలమై విహరించాం. తరువాత బస్ వస్తే హనవర బయలుదేరివెళ్ళాం.  సాయంత్రం అయిదో, అయిదున్నరకో హనవర చేరుకున్నాం. అది కూడా పెద్ద పట్టణం లాగే కనిపించింది.  ఓ అరగంట పాటు పట్టణ విహారం చేసి, దగ్గర్లోని ఓ టీ కొట్టులో టీ కొట్టి, మళ్ళి బస్ ఎక్కాం .  మురుడేశ్వరం వెళ్ళే  దారిలో..    హనవరను ముద్దాడుతూ శరావతి నది అరేబియా కౌగిలికి పరుగులెత్తే దృశ్యాలు, హనవరకు దక్షిణాన బీచ్ ను తలపించే దృశ్యాలు   కనువిందు చేస్తాయి. శరావతి పై  నిర్మించిన వంతెన   దాటుకుంటూ  బస్ కదిలిపోయింది.                            

       మురుడేశ్వరం వెళ్ళే దారంతా అందమైన తోటలతో, వయ్యారాలు పోయిన నడకతో సాగిపొయింది.  అప్పటికే  సూర్యుడు డ్యూటి  దిగిపోవడంతో , ఇక అడిగేవారు ఎవరని దిక్కులంతా చీకట్లు కమ్మడం మొదలయ్యాయి. ప్రకృతి సోయగం చూసే అవకాశం తప్పిపోయింది కదాని విచారిస్తుండగానే, అప్పటికే ప్రయాణ బడలికచే కళ్ళు మూతలు పడ్డాయి.
మూరుడేశ్వరం అన్న పిలుపుతో  మల్లి ఇహలోకంలోకి  వచ్చి గబ గబా బస్ దిగి, మెయిన్ రోడ్డు  నుండి గుడికి వేళ్ళే దారి పట్టాం - కాలి నడకన.  ఓ 15 నిమిషాల నడక తరువాత గుడి చేరుకున్నాం.  అల్లంత దూరం నుండే  మనకు ఆహ్వానం పలుకుతుంది గుడి ముందరి గాలి గోపురం.
  నా వరకు నేను చాలా దేవాలయాలు చూశాను. కాని   ఇంత ఎత్తైన గాలి గోపురం మటుకు ఎక్కడా చూడలేదు.  పద్దెనిమిది అంతస్తులతో, తల పూర్తిగా పైకి ఎత్తి   చూస్తే గాని శిఖరాన్ని  చూడలేనంత ఎత్తుతో అలరారుతుంది.  పొందికైన నిర్మాణాన్ని  రూపొందించడం కన్నా ఎత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కన్పిస్తుంది - గోపుర నిర్మాణంలో.   మూడు పక్కల అరేబియా సముద్రం ఆవరించి ఉన్న ఎత్తైన కొండపై గుడి,  దాని వెనుక కొండ మీద ఎత్తైన పరమేశ్వరుని విగ్రహం, శివుని తాపాన్ని చల్లార్చటానికి  కొండ చుట్టూ ఎగసి పడే సముద్రపు అలలు, విగ్రహం చుట్టూ పచ్చటి పచ్చికలో శివ భక్తుల విగ్రహాలు, కొండకు ఎడమ వైపు బీచ్ చూపరులను ఆకట్టుకుంటాయి.  కొండకు అనుకుని ఉన్న దారిలో,  బీచ్ లో మొలిచినట్లుగా ఉన్న ఓ హోటల్ లో కడలి కెరటాల అందాన్నిచూస్తూ, సముద్రపు హోరును వింటూ, ఆ రాత్రి భోజనం కానిచ్చి మళ్ళి తిరుగు   ప్రయాణం అయ్యాం- హుబ్లీ దారిలో.....
                                                                                                                           - నాయుడుగారి జయన్న

 









6, నవంబర్ 2013, బుధవారం

మీనీలు

అడ్డేలేదు
నేనే రాజు
నా  కలల సామ్రాజ్యానికి.
        **

నిజమే 
ఏ రెక్కలు లేవు నాకు
అయినా విహారమే
నా ఊహల  నింగిలో 
         **

చీకట్లోనే నేనొంటరిని
వెలుగుల్లో నాకూ ఓ తోడు
నా నీడ

 - నాయుడుగారి  జయన్న

3, నవంబర్ 2013, ఆదివారం

అక్కడే..



ఎంత తోడినా
ఊరుతూనే ఉంది
గుండెబావిలో
వేదనాజలం

విశ్వ ప్రయత్నాల
తరువాత కూడా విఫలమే
పగిలిన మనసు అద్దాన్ని అతకటంలో..

లక్ష్ల కోట్ల అడుగుల ప్రయాణం
అయినా అక్కడే
పాదంతో పాటూ
భూమీ పయనమే

     - నాయుడుగారి జయన్న