30, జనవరి 2015, శుక్రవారం

స్వాతంత్ర్యోద్యమంలో విదేశీ ఆణిముత్యం- మెల్లీ

మెల్లీ ప్రముఖ రచయిత ఉప్పల లక్ష్మణరావు భార్య. అతడు-ఆమె, బతుకు పుస్తకం మొదలగు రచనలతో తెలుగు సాహితీలోకానికి ఉప్పల వారు సుపరిచితులే. మెల్లీ ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశాన్ని ప్రేమించి, ఈ దేశదాస్యశృంఖలాలను తెంచుటకు స్వాతంత్ర్యోద్యమంలో తెగువతో పోరాడిన మహిళ. జీవితాన్ని నిర్భయంగా, నిర్నిబంధంగా గడిపిన ఆదర్శ మహిళ. స్విట్జర్లాండ్‌లో జన్మించి, తెలుగింట కోడలుగా అడుగుపెట్టిన మహిళ.
మెల్లీ మానవతామార్తి 
మెల్లీ  కరుణామయి. 24 సంవత్సరాల వయసు. మెడిసిన్ చదివే రోజులు. ఒకరోజు ఓ విందుకు హాజరవటానికి వెలుతుంది. ఆ దారిలో ఓ వృద్దుడు తన పెంటబండిని లాగలేక అవస్థలు పడుతున్నాడు. ఆ దృశ్యం మెల్లీ కంటబడింది. పార్టీ, తన విలువైన బట్టలు, హోదా ఏవీ గుర్తురాలేదు ఆ క్షణాన మెల్లీకి, ఏ మాత్రం సంకోచించకుండా, ఆ పెంటబండిని వెనుక నుండి తోసి వృద్దుడికి సహాయపడింది. పెంటమరకలంటిన బట్టలతోనే ఆ పార్టీకి ఆలస్యంగా హాజరైండి ఆ మానవతామూర్తి. ఆ విందులోనే లక్ష్మణరావు మెల్లీని మొదటిసారి చూశాడు.

సాహసానికి మారు పేరు
మెల్లీ సాహసానికి మారు పేరు. తనకు అవమానమో, తాను తలపెట్టిన మంచిపనికి అవరోధమో కలిగితే ఆమె సహించేది కాదు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుండి పశ్చిమ గోదవరి జిల్లాలోని నరసాపురానికి తిరుగు ప్రయాణమైంది. గోదావరి నది దాటటానికి ఒక లాంచీ ఎక్కింది. అయితే ఎవరో పెద్ద అధికారి లాంచీలో ప్రయాణం చేయడానికి వస్తున్నాడని, లాంచీని చాలా సేపు ఆపివేశారు. చాలా సేపు ఎదురుచూసినా అతను రాలేదు. లాంచీ కదలలేదు. సహనం కోల్పోయిన మెల్లీ ఈతకు అనువైన బట్టలు ధరించి ఆలస్యం చేయకుండా అమాంతం గోదావరిలో దూకి, అమావాస్య నాటి ఆ సాయంకాలం, ఐదు గంటలపాటు, 15 మైళ్ళు ఈది నరసాపురం చేరుకుంది. ఒళ్ళు గగురుపొడిచే మెల్లీ సాహసానికి లక్ష్మణరావు మొదట నొచ్చుకున్నా, ఆ తరువాత మెచ్చుకున్నాడు.

అన్నింటా సగం
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఒకసారి గాంధీజీ ఎరవాడ జైలులో ఉన్నాడు. అదే సమయంలో మెల్లీ సబర్మతీ ఆశ్రమంలో ఉంది. ఆశ్రమంలో, ఆ చుట్టుపక్కల పురుషులు గస్తీ తిరుగడం ఆనవాయితీ. స్త్రీలకు ఆ పని నిషేధం. స్త్రీలను పిరికివారిగా చూడటం మెల్లీకి నచ్చలేదు. స్త్రీలకు కూడా గస్తీ తిరిగే అవకాశం ఇవ్వాలని ఆశ్రమంలో సత్యాగ్రహం చేపట్టింది. విషయం గాంధీజీ దాకా వెళ్ళింది. గాంధీజీ అర్థం చేసుకొని, అంగీకరించాడు. అదీ అమె పట్టుదల.

స్వాతంత్ర్యోద్యమంలో...
మెల్లీ విదేశీయురాలైనా, ఈ దేశాన్ని ప్రేమించి, దేశ స్వేచ్చావాయువులకై ఆమె ఎడతెగని పోరాటమే చేసింది. అప్పటికి ఆమె లక్ష్మణరావు అర్ధాంగిగా కూడా మారలేదు. ఆ పోరాటంలో భాగంగా మూడున్నర సంవత్సరాలు జైలు జీవితాన్ని కూడా గడిపింది. జైలులో గడిపిన క్షణాళ్ళో కూడా అమె ప్రశాంతంగా జీవించలేదు. జైలులోను స్త్రీల సమస్యలకై పోరాటం చేసింది. స్త్రీలకు జైలులో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని నిరహార దీక్ష చేపట్టింది. అనుకున్నది సాధించింది.
    తూర్పు గోదావరి జిల్లాలో, స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఖాదీ ప్రదర్శన కార్యక్రం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనవొద్దని అప్పటి, అక్కడి పోలీసు సూపరింటెండెంట్  అమెను హెచ్చరించాడు. నేను పాల్గొనకూడదని ఏ ప్రభుత్వ ఆదేశాల్లో ఉందో చూపించాలని పట్టుపట్టింది మెల్లీ. అంతటితో ఊరుకోకుండా, మీరు నన్నీలాగే నిరోధిస్తే, నేను మాదేశ రాయబారికి విషయం తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడు సమస్య అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అప్పుడు మీ పరిస్థితి ఆలోచించుకొండి అని ఎదురు బెదిరించింది. పాపం ఎస్పీకి తోక ముడువక తప్పలేదు. అదీ అమె ధీరత్వం.   

దుందుడుకు కాదు అతి నెమ్మదస్తురాలు 
మెల్లీ జీవితమంతా అలజడే. స్వేచ్చ, సమానత్వం, హక్కులు, పోరాటం. ఇదీ స్తూలంగా అమె జీవితం. ఈ ప్రస్థానంలో అమె మనకు దుందుడుకురాలిగా కనిపించవచ్చు. అది కొంత వరకు వాస్తవం కూడా కావొచ్చు. కాని ఆమె అంతకు మించిన నెమ్మదస్తురాలని ఆమె వైవాహిక జీవితమే చెబుతుంది. లక్ష్మణరావుతో పరిచయం,స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా మారడానికి అమెకు పద్నాలుగు సంవత్సరాలకు పైగానే పట్టింది. ఏడు సంవత్సరాల స్నేహం అనంతరం, మిమ్మల్ని, మీ దేశాన్ని, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాకే అర్ధాంగిగా మారుతానని షరతు పెట్టింది.  ఆ మాట ప్రకారమే దేశంలో అడుగుపెట్టింది. లక్ష్మణరావుకన్నా ముందు దేశ పరిస్థితులను అర్థం చేసుకుంది. తన తొలి ప్రాధాన్యం ఏమిటో అమెకు బోధపడింది. దేశ స్వాతంత్ర్యం కొరకు, వివిధ రంగాలలో దేశ పురోగమనం కొరకు, స్త్రీ స్వేచ్చా హక్కుల కొరకు తదాత్మ్యంతో పాటుపడింది. ఈ ప్రయాణంలో మరో ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత లక్ష్మణరావును అర్థం చేకుంది. అర్ధాంగిగా అతని జీవితంలో అడుగుపెట్టింది. అది కూడా షరతులతోనే.
మెల్లీ అస్తమించినా ఈ దేశ స్వేచ్చావాయువులలో, స్త్రీ సమానత్వపు హక్కులలో అమె పోరాటం, అమె త్యాగం అంతర్లీనమై, సజీవంగా కొనసాగుతూనే ఉంటాయి.


28, జనవరి 2015, బుధవారం

పోల్కంపల్లి శాంతాదేవి

పోల్కంపల్లి శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను  తన నవలలో చిత్రీకరిస్తూ సామిజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలంగాణ నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపూర్ వీరి స్వస్థలం. వీరి కథలపై శరత్ ప్రభావం ఎక్కువ.
     1942లో సీతమ్మ, సూగూరు హనుమంతరావు దంపతులకు జన్మించింది. వీరి పూర్వికులు, తండ్రిగారు కూడా వనపర్తి సంస్థానాధీశుల దగ్గర ఉన్నతోద్యోగులుగా పనిచేశారు. విద్యార్థి  దశ నుండే రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు.  1961లో వీరి మొదటి రచన ముక్తిమార్గం కుసుమహరనాథ పత్రికలో అచ్చైంది. ప్రజామత వారపత్రికలో ధారావాహికగా వీరి మొదటి నవల పాణీగ్రహం వచ్చింది.అదే పత్రికలో ఆ తరువాత కాలపురుషుని హెచ్చరిక వచ్చింది.  ఈమె 40 కు  పైగా నవలలు రాశారు. చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం,పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలతదేవదాసి, పుష్యమి, వరమాల వీరి నవలలో కొన్ని.
 7 కథాసంపూటాలు వెలువరించింది. 1974లో ముళ్ళగులాభి అను కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకవచ్చింది. జీవన సంగీతం, ప్రేమబంధం నవలలకు ఆంధ్రప్రభ నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. చండీప్రియ, పుష్యమి, వరమాల, పచ్చిక నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. ఉజ్జ్వల. నవజ్యోతి, నవసాహితీ వంటి పలు సంస్థలు వీరి రచనలను ముద్రించాయి. జ్యోతి, జాగృతి వంటి పలు పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈమె మంచి వక్త కూడా. ఆదర్శగృహిణి. అల్లికలు,చిత్రలేఖనం, సాహిత్య కార్యక్రమాలాలో పాల్గొనడం ఆమె అభిరుచులు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*






25, జనవరి 2015, ఆదివారం

నా యాత్రానుభవాలు-5, బేలూరు

                                                                                                                                                 హోస్పేట్,
                                                                                                                                                13.10.2013.

     మా యాత్రలో బాగంగా, నేను, నా మిత్రులు బషీర్, గిరి హంపిని సందర్షించి ఆ రాత్రి హోస్పేట్‌కు చేరుకున్నాం. బస్టాండ్‌కు దగ్గరలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో భొజనాలు కానిచ్చి, బస్టాండ్‌కు వచ్చాం. మా మిత్రుడు గిరికి ఇంటి నుండి పిలుపు రావడం వలన, మాకు వీడ్కోలు పలికి గద్వాల దారి పట్టాడు. నేను, బషీర్ ఆ రాత్రి 11 గం.లకు బేలూరుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. చిక్మగ్లూర్ వెళ్లే బస్సెక్కాం. అర్ధరాత్రి  దాటాకా చిక్మగ్లూర్లో బస్సు మారి, బేలూరుకు ప్రయాణమయ్యాం. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే బేలూరు చేరుకున్నాం.
                                                                                                                                           బేలూరు ,
                                                                                                                                          14.10.2013.
    బేలూరును  పూర్వం  వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి  బేలూరు గా మారింది. ఇది యాగాచి నది ఒడ్డున ఉన్న ఓ చిన్న పట్టణం. హాసన్ జిల్లాలో జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని. 
     బస్టాండ్ నుండి కాలి నడకన గుడి వైపు వెళ్ళాం. అల్లంత దూరం నుండే గుడి గోపురం స్వాగతం పలుకుతున్నటుగా కనిపించింది. గుడి బయట సత్రాల్లో స్నాదికాలు కానిచ్చి, గుల్లోకి వెళ్లాం.   ఆలయ రాజగోపురం బహు సుందరమైనది. గుడి హొయసలులు నిర్మించినదే అయినా రాజగోపురాన్ని విజయనగర రాజులు నిర్మిచారు.  రాజగోపురం దాటి లోపలికి వెళ్తే, ఎదురుగా మధ్యలో చేన్నకేశావాలయం  ఉంది. ఇది తూర్పుకు అభిముఖంగా ఉంది. గోపురానికి కుడివైపు పుష్కరిణి, కేశవాలయానికి చుట్టూ  రంగనాయకి ,కప్పే చేన్నగరాయ ఆలయాలు ఉన్నవి. చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు.  ఇక్కడ  ఆంజనేయస్వామి, నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు.  ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది
          ఇక్కడి ప్రధాన దైవం చెన్నకేశవుడు.  ఇతనిని విజయ నారాయణుడు అని కూడా అంటారు. స్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడి స్వామి ముక్కుకు ముక్కెరతలపై పూలు ఉండటం విశేషం. అందుకే ఇక్కడి వారు స్వామిని మోహిని అవతారంగా భావిస్తారు.  స్వామి  నాలుగు హస్తాలతో శంకు ,చక్ర గద ,పద్మాలతో  మనోహరంగా దర్శనం ఇస్తాడు. .విగ్రహం పై భాగాన చుట్టూ దశావతారాలు అతి సూక్ష్మం గా చెక్కబడి ఉన్నాయి.  లోపల కళా సంపదతో విలసిల్లె స్తంభాలు న్నాయి .గోడలలో గాలి, వెలుతురు లోపలికి రావాటానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కారు. దర్శనానంతరం గుడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలించాం. ఆ శిల్పాలు, వాటి కళాత్మక  సౌందర్యం చెప్పనలవికానిది. ఈ ఆలయం ఎత్తైన పీఠంపై నిర్మిచబడింది. ఈ పీఠాన్ని జగతి వేదిక అంటారు. ఆలయ ప్రదిక్షణకు వీలుగా  ఉంటుంది. హోయసల రాజు విష్ణువర్ధనుడి కాలంలో ఈ  ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది.  హోయసల అనగా సింహాన్ని ఒంటి చేతితో చంపినవాడు అని అర్థమట. ఆ పని చేసినవాడు వీరి వంశమూలపురుషుడు సాలుడు. ఆ వంశస్తులకు అదే పేరుగా స్థిరపడిపోయింది. హోయసలులు చాళుక్య ,చోళ, పాండ్యలను  ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించారువీరిలో విష్ణు వర్ధన మహారాజు చాళుక్యులను ఓడించి సామ్రాజ్య సుస్థిరతకు బాట వేశాడు.  క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది.

ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతి(Chloritic Schist )తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది.   ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుదట. అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన  ఆకర్షణీయ శిల్పాలలో  కొన్ని.
ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన కప్పే చెన్నగ రాయావిగ్రహాన్ని  హొయసాల రాజు విష్ణువర్ధనుడి పెద్ద భార్య, గొప్ప నర్తకి అయిన  రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది .దీన్నే కప్పు చెన్న  కేశవ ఆలయం అంటారు   ఈ ఆలయానికి ఈ పేరు రావటానికి వెనుక  ఓ జానపద గాథ ఉంది.  ప్రసిద్ధ శిల్పి జక్కనా చార్యుడు తన స్వగ్రామం కైదల నుంచి ఇక్కడికి వచ్చాడు .అతని కుమారుడు దంకనా చార్యుడు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాడు .ఒకరికొకరు తెలియదు .జక్కన చెన్న కేశవ విగ్రహం చెక్కాడు  .కొడుకు ఆ శిల్పంలో  లోపం ఉందన్నాడు. లేదని వాదించాడు తండ్రి. లోపం చూపిస్తే కుడి చేయి నరుక్కుంటానని శపథం చేశాడు . విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించారు. గంధం అంతా యిట్టె ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం ఆర లేదు. అక్కడ ఒక ఖాళీ కనిపించింది . అందులో ప్రాణం తో వున్న  ఒక  కప్ప బయట పడింది. ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు. అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు .దేవుడు కలలో కన్పించి స్వగ్రామ రమ్మన్నాడట .తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞగా చెన్న కేశవ ఆలయాన్ని కట్టారు .జక్కన చేయి మళ్ళీ తిరిగి వచ్చిందట. .ఆలయం బయట  నలభై రెండడుగుల  ధ్వజస్తంభం ఉంది. దీని  విశేషమేమిటంటే  ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.  రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది.  నేటికీ భక్తులు  ఉపయోగిస్తుంటారు. హొయసల శైలి కట్టడాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునక. హోయసలుల శిల్పకళారీతులకు కాణాచిగా పేరొందిన బేలూరు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మనసు నిండా నింపుకొని, బయటకు వచ్చాం. గుడికి దగ్గరలోని ఓ టిఫిన్ సెంటర్‌లో  టిఫిన్ చేసి హాళేబీడు వైపు బయలు దేరాం.








20, జనవరి 2015, మంగళవారం

తిరుపతిలో తెలుగు వికీపీడియా సమావేశాలు

2015 ఫిబ్రవరి  14, 15  తేదీలలోరెండు రోజులపాటు తిరుపతిలో వికీపీడియా  11 వ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగినవారు పాల్గొనవచ్చు.

18, జనవరి 2015, ఆదివారం

గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం

గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం

                                                    బక్కమ్మ
                                                                    |
                                                                    ↓(పెంపుడు కుమారుడు)
                                                పెద శోభనాద్రి|పెదసోమ భూపాలుడు|సోమనాద్రి
                                                           (1663-1712)
                                  రాణి అమ్మక్కమ్మ|           | రాణి లింగమ్మ
                                        (సోమనాద్ర పెద్దభార్య)|         |(సోమనాద్రి చిన్నభార్య)
                                                 (1746-47)                        (1747-60)
                                                                                              |
                                                                                             ↓(దత్తపుత్రుడు)
                                                                                రాజా తిరుమలరావు 
                                                                                    (1760-64)
                                                                  రాణి మంగమ్మ|           |రాణి చొక్కమ్మ
                                               (తిరుమలరావు పెద భార్య)   |           | (తిరుమలరావు చిన్న భార్య) 
                                                         (1764- ... )                         (1764- 68)  
                                                                                |        −−−−−−−−−−−→ ↓(చొక్కమ్మ మరిది) 
                                                                                                    రాజా రామరాయలు 
                                                                                                    |                            (1768-83)
                                                                                                    | 
                                                                                                    | (చొక్కమ్మ కుమారులు)
                                                                                                   ↓ (రాజ రామరాయల పెంపుడు కుమారులు)
                             ↓ −−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− ↓
                     రాజా చినసోమభూపాలుడు                                         రాజా చిన రామభూపాలుడు
                          (1784-1815)                                                                 (1816-28)
                                                                                                                 |
                                                                                                                 ↓(ఏకైక కుమారై)
                                                                                                           లింగమ్మ 
                                                                                               (రా.సీ.రా.భూ. రెండవ భార్య ) 
   |------------−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−    |                       (1861-63) 
    |                                                                                         |భర్త| రాజా సీతారామభూపాలుడు 
   |                                                                (రాజా చిన రామభూపాలుడి ఇల్లరికపు అల్లుడు)
    |                                                                                         (1828-61)
    |                                                                                     వెంకటలక్ష్మమ్మ   ||        అనంతమ్మ
    |                                                                  (రా.సీ.రా.భూ. మొదటి భార్య)       (రా.సీ.రా.భూ.మూడవ భార్య)
    |                                                                                  (1867-87)
    |                                                                                             |
    |(లింగమ్మ దత్తపుత్రుడు)                                                           |
   ↓                                                                                              |
రాజా సోమభూపాలుడు                                                    | (వెంకటలక్ష్మమ్మ దత్తపుత్రుడు)
     (1863-66)                                                                             ↓
                                                                               రాజా రామభూపాలుడు
                                                                                       (1887-1923)
                                                                                              |భార్య||రాణి లక్ష్మీదేవి (1923-35)
                                                                                              |
                                                                                              | (దత్తపుత్రుడు)
                                                                                             ↓
                                                                            రాజా చిన సీతరామభూపాలుడు
                                                                                          (1935-46)

                                                                                 ||భార్య||రాణి ఆదిలక్ష్మిదేవమ్మ (1946-47)

7, జనవరి 2015, బుధవారం

జొన్నవాడ రాఘవమ్మ

జొన్నవాడ రాఘవమ్మ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ప్రముఖ కవయిత్రి. నవాబుపేట మండలం, కేశవరాయునిపల్లి ఈమె స్వస్థలం. 1928లో ఆమె జన్మించింది. ఈమె భర్త వేదాంతాచారి. 1970 ప్రాంతంలో ఈమె రచించిన అనేక లలితగీతాలు, దేశభక్తి గేయాలుజానపదగేయాలు, భక్తిగీతాలు, ఆకాశవాణిలో ప్రసారమయ్యి, విశేష ప్రజాదరణ పొందాయి. వీరు రాసిన అనేక గీతాలను మహా భాష్యం చిత్తరంజన్ గారు స్వరపరిచారు. చిన్ననాటి నుండి భారతం, భాగవతం, రామాయణం వంటి గ్రంథాలను నిత్యపారాయణం చేసేది. ఈ అలవాటే ఆమెను లలిత, భక్తిగీతాల రచయిత్రిగా మార్చివేసింది. ఆమె 1972లో 48 గేయాలతో  రాధికాగీతాలు గ్రంథాన్ని వెలువరించారు. వీటికి మరికొన్ని గేయాలను చేర్చి 2006లో ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు. 2014లో భావతరంగాలు పేరుతో ఆమె మరో గ్రంథాన్ని వెలువరించారు. అనేక సాహితీ సంస్థలు వీరి సాహితీ కృషికి పలు సత్కారాలను అందించాయి. 2015 జనవరి 6 వ తేదిన ఆమె మరణించారు.
రచనలు 
# రాధికాగీతాలు(1972),(2006)
# భావతరంగాలు(2014)
కొన్ని లలితగీతాలు 
# శ్రీ శేషాచలవాసా
# నవ్వకే నెలవంక నవ్వకే
# పిల్లనగ్రోవి మెల్లన ఊది
# ఎవరు పెంచిన
# ఏలరాడే చెలి
# ఏదే అల్లరి వనమాలి
పురస్కారాలు
* 2009లో హైదరాబాద్ శ్రీజ్ఞాన సరస్వతీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారిచేత శ్రీకృష్ణపద సుధానిధి బిరుదుతో సత్కారం.
* 2012లో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాహితీ పురస్కారం.
* 2012లో విశాలాంధ్ర వారి పురస్కారం.
* 2013 పాలమూరు సాహితీ ఉగాది పురస్కారం.
లలితగీతాల వీడియో లంకె 

*[https://www.youtube.com/watch?v=XVNmVYz6KUU]|ఎవరుపెంచిన
Reference:
'మూగవోయిన పాలమూరు కవనం', ఈనాడు దినపత్రికజిల్లా పేజిపుట- 14, తేది:07.01.2015.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*