30, నవంబర్ 2016, బుధవారం

ఎప్పుడు మారుతార్రా మీరూ?

సిద్ధాంతం -
పరిధులు దాటిన పైత్యం
మతంపై యుద్ధం -
ఒంటి కన్ను సూత్రం
శత్రు దేశంతో యుద్ధం -
పనికిరాని తంత్రం
అంతర్గత పోరుకు -
సదా ఎప్పుడు సిద్దం
దేశభక్తి
దేహ భుక్తి
సైనికుడు
చీడ పురుగు
దేశ ద్రోహి
వీరభక్తుడు
మానవ హక్కులు
మనకే
పౌర విధులు
హుళ్ళక్కే!
నాది మాత్రం సత్యం
మిగతాదంతా మిథ్యా !

29, నవంబర్ 2016, మంగళవారం

ఏది అరాచకం ?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుశీర్షికన ఇంత అరాచాకమా? పేరిటి రాసిన ఎడిటోరియల్ చదివాకా, ఆయన అభిప్రాయాలకు, ప్రశ్నలకు నా సమాధానాలు... నా అభిప్రాయాలలోకి వెళ్లేముందు, నేను ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మద్దతుదారుణ్ణే కానీ, ప్రధానికి గానీ, ఆయన పార్టీకి గానీ మద్దతు దారున్ని కాదు. ఇక రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలకు నాలాంటి అతి సామాన్య దిగువ స్థాయి వ్యక్తులు కూడా సమాధానాలు చెప్పగలరనే ఉద్దేశ్యంతోనే ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం. ఆయన గారి అభిప్రాయాలు...నా సమాధానాలు

1. ప్రత్యామ్నాయ నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఉందా?
ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది? ఆధాయ పన్ను ఎగేసిన నల్ల నోటుకా? న్యాయబద్దమైన నోటు మార్పిడికి అవకాశం ఉంది కదా! మన దగ్గర అన్ని రూపాలలో పోగేసిన చట్టబద్దత లేని డబ్బుకంతా ప్రత్యామ్నాయం అడుగటం సమంజమేనా?

2. అటు ప్రధాని ఇటు ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది.
ప్రజలు ఇప్పుడు కొంత కష్టం కలిగి కంటతడి పెట్టుకుంటున్న మాట వాస్తవమే. ప్రజలతో పాటు ప్రధాని కూడా కంట తడిపెడుతున్నారు అని చెప్పినప్పుడు...ప్రజల ఏడుపులో(ఏ ప్రజలో ఇది మరో ప్రశ్న ) నిజాయితీని చూసిన రాధాకృష్ణ ప్రధాని ఏడుపులోని నిజాయితీని కూడా అంగీకరించినట్లే కదా!

3. డబ్బున్న వాడిపై డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం ఉన్నవారు చచ్చారుఅని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
అధికారంలో ఉన్న వాడిపై అధికారం లేని వాడికి కోపం ఉండటం రాజకీయనాయకుల సైకాలజీ అన్న మాటను RK అంగీకరిస్తాడా? డబ్బు ఉన్న వాడిపై డబ్బు లేని వాడు ఏడిస్తే (నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని ఏడ్చే వాళ్ళకు) భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాలేమిటో పనిలో పనిగా సెలవిచ్చి ఉంటే మా బోటి అజ్ఞానులం కోందరమైనా మారే వాళ్ళమే. నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని సంబరపడి పోకండి అని హెచ్చరించడంలో RK ఎటు వైపో అర్థం కావటం లేదా? ఆ ధ్వనిలో అర్థం స్పష్టం కావటం లేదా?


4. అవినీతి ఇవ్వాళ కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు.
• ....అంటే ఇది ఇలాగే ఉండాలా? అంతం ఉండొద్దా ?


5. మన దేశ ఆర్థిక వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి.
ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంతకు మించిన సిగ్గేస్తుంది. దేశానికి, రాష్ట్రాలకు రాబడి రావడమే ముఖ్యమా? వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడమే ముఖ్యమా? అది ఏ రూపానా? ఏ మార్గానా? అన్నది అక్కరలేదా? అదే అవునైతే... ఇన్ని బడు లెందుకు? ఇంతమంది ఉపాధ్యాయులెందుకు? ఇన్నిన్ని జీతాలెందుకు? ఇన్ని నీతి సూత్రాలెందుకు? బడి ఉన్న ప్రతి చోటా ఓ సారా దుకాణమో! ఓ నల్ల మందు అంగడో! ఏ వ్యభిచార కొంపో! ప్రభుత్వాలు పెట్టుకుంటే రాబడి రాదా? పెట్టుబడి మిగిలిపోయి, రాబడులు పెరిగిపోయి ప్రభుత్వాలు ఇక అన్ని రంగాలను 3 పువ్వులేమి కర్మ 6 పువ్వులకు 90 కాయలు కాయించగలదు. దీనికి RK ఒప్పుకుంటాడా?


6. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఒక్కసారిగా తమ ఆస్తుల విలువ పడిపోయిందని బాధపడుతున్న వారికి ఉపశమనం ఎవరు కలిగిస్తారో చెప్పాలి.
ఉన్న ఆస్తికి విలువ పడిపోయినప్పుడు, కొనదలచుకున్న ఆస్తి విలువ కూడా అంతే అన్న సత్యం బోధపడదా? ఇప్పుడు ఆస్తిపరులకు ఉపశమనం మాట సరే. ఆ మాత్రం ఆస్తి కూడా లేని పేదలకు ఇన్నాళ్ళు ఎవడైనా ఉపశమనం కలిగించాడా? అందులో శతాంశామైనా ఆస్తిని కూడ గట్టుకోగలమనే భరోసా ఇచ్చారా? “నల్లధనం ఉన్నవారు చచ్చారుఅని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారుఅని RK అనగాలిగాడంటే ఇప్పుడు ఆ పని ప్రధాని చేసినట్లే నని RK అంగీకరించగలడా?

7. ఏ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను ముద్రించారో చెప్పాలి.
తాత్కాలిక నోట్ల సర్దుబాటుకు/మార్పిడి కని సామాన్యుడికి సైతం అర్థమైంది. RK కు అర్థం కాలేదంటే విడ్డూరమే. 4 ఐదు వందలకు 1 నోటు, 2 వేయి నోట్లకు 1 నోటుతో సర్దుబాటు చేయడం, ముద్రణకు, సరఫరాకు ఎంతో ఉపయోగపడుతుందనే. కాలక్రమేణా అంతర్ధాన మవుతుందని చెబుతున్నా అదే ప్రశ్న వేయడంలో అర్థమేమిటో వేసేవారికే తెలియాలి.


8. దేశంలో ఇకపై నల్లధనం ఉండబోదని ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరా?
ఇకపై ఉంటుంది కాబట్టి, ఇప్పుడూ ఉండనీయమనడమా దీనర్థం. నీతి మంతుడిని మాత్రమే కనగలనని ఏ తల్లైనా హామీ ఇవ్వగలదా? కనడం, నిజాయితీగా పెంచడం, కలలు కనే వరకే తన బాధ్యత. ఆ తరువాత ఏమవుతాడన్నది వాడి ప్రవర్తనే నిర్ణయిస్తుంది. ఏ తల్లైనా అవినీతి పరుడిగా కొడుకును పెంచాలని కలలు కంటుందా? అయినప్పటికీ ఈ దేశంలో ఇంత మంది అవినీతి కొడుకులు ఎలా తయారు కాగలిగారో అర్థం కావడం లేదా?


9. ఇప్పుడు తాజాగా బంగారం కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించాలని కేంద్ర
ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మహిళలు తిరగబడతారు.

*“అక్రమ సంపాదన పోగేసుకున్నవారెవ్వరూ తమ ఇళ్లలో నగదును సూట్‌కేసులలో దాచిపెట్టుకోరు. భూములు, భవనాలు, బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెడతారు.అని అనే RK నే అట్లాంటి ఆస్తి విలువ తగ్గిందని ఒక చోట బాధపడుతాడు. ఆ నల్ల ధనంతో కొనే బంగారుపై ఆంక్షలు విదించొద్దని కోరుతాడు. ఇదేమి ద్వంద్వ నీతో అర్థం కాదు.


10. పచ్చిగా చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో మొదటిది... అవకాశం ఇచ్చినవాడిది తప్పా? అది సద్వినియోగం చేసుకోలేని వాడిది తప్పా? రెండోది మొదటి దాని కన్న అర్థవంతమైనది. ఆవశ్యకమైనది.

11. నల్లధనాన్ని నిజంగా అరికట్టాలన్న ఉద్దేశం ప్రధానమంత్రికి ఉంటే దుందుడుకు నిర్ణయాలు తీసుకునే బదులు ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.
ఒక పత్రికాధినేతగా, ఛానెల్ అధిపతిగా ఆ ఉద్దేశ్యంలో నీకు భాగస్వామ్యం లేదా? నీవు, నీ తోటి అధిపతులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఆ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలెంటో సూచించండి.


12. పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం.
ఒక ఆర్ధిక నిపుణుడు రాజ్యంగా బద్దంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలు మౌనంగా ఏలిన కాలంలో, ఒక రాజ్యాంగేతర శక్తి తెరవెనుక నిర్ణయాలు తీసుకుంటుందని అప్పటి ప్రతిపక్షం ఏడ్చినప్పుడు ప్రశ్నించని మీడియాకు, రాజ్యంగ బద్దంగా ఎన్నికై ఏలుతున్నవాడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏక పక్షమని ఏడుస్తుందేం?


----ఎన్. జయన్న

27, నవంబర్ 2016, ఆదివారం

అన్నా!

అన్నా!
నాకు కుల వ్యవస్థపై విశ్వాసం లేదు.
నా కులంపై కూడా నాకు మోజు లేదు.
నీవు నా కులం కూడా కాదు
నీ గురించి మాట్లాడటం వలన నాకొరిగేది లేదు.
అయినా చెబుతున్నా ...
నీవంటే విపరీతమైన గౌరవం
అంతకు మించిన అభిమానం
అన్నా!
 ఎక్కడ మోగించావో గానీ
తోలు తప్పెడ పైన మోత 
ఊరూరా దండోరై మోగింది పో...
చెప్పుకోవడానికే సిగ్గుపడే కులం
పేరు పక్కన దర్జాగా నిలబడింది పో...
నీ పిలుపు విన్నాకా,
ఊర్లల్లో రెండు గ్లాసులు ఒక్కటయ్యాయి
వెలివాడల్లో వెలుగులు నిండాయి
రెండు దశాబ్దాల సంది
ఒక కులం కోసం పోరాడినవాడు
నీవు కాకా ఇంకొకడున్నాడా దేశంలో 
నిన్ను శూరుడు, దేవుడు అని అనలేను కానీ,
నీవు కులం కోసం పుట్టిన అంబేద్కర్ వే
జాతి నుద్దరించిన పూలే వే
అందుకే 
నీ ధర్మ యుద్ధం
విజయం సాధించాలని కోరుకుంటున్నా

--ఎన్. జయన్న