19, జులై 2015, ఆదివారం

గురుగింజలు

గురుగింజలు
పులి కాదు
పులి బిడ్ద కాదు
అడ్డంగా దొరికినోడెవడైనా
మహా చెడ్డ దొంగే
మరి 'దొర​'క​(కొ)ని(న​)వాడు....??
దొరలనే పిలుద్దాం!
దొరలనే కొలుద్దాం!
అవసరమనిపిస్తే
భజనగీతం రాసి భక్తితో పాడుదాం
అదీకాదంటే
శిరస్సొంచి, శివాలెత్తి ఆడుదాం
మన పిచ్చిగాకపోతే
పైస మీద ప్రజాస్వామ్యం పరిఢవిల్లు కాలానా
గు...కింద నలుపుండని
గురుగింజలు దొరుకుతాయా?
కళ్లకున్న గంతలన్ని విప్పేస్తే
జెండా ఏదైనా దోచే ఎజెండా కనిపిస్తది
ముడుచుకున్న గుండెను విప్పారిస్తే
నేత ఎవ్వడైనా నీతిమాలిన తనం అగుపిస్తది.
----ఎన్. జయన్న​
     

14, జులై 2015, మంగళవారం

పుణ్యమా? -పాపమా?

పుణ్యమా? -పాపమా?
రాజమండ్రి, షాంగై, మక్కా,
ప్రాంతమేదైనా కావొచ్చు
పుష్కరాలు, వేడుకలు
సందర్భం ఏదైనా కావొచ్చు
ఊపిరిపోయడానికి బదులు
విశ్వాసాలకు ఊపిరితీయడం
ఇప్పుడు కొత్తేమి కాదు
జరిగిన సంఘటనల నుండి
జనం పాఠం నేర్వకపోవడమే వింత​
ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ  వైఫల్యాలు
చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగపు నిద్రమత్తు
వీటికి తోడు వివేకరాహిత్య ప్రజోత్సాహం తోడైతే
జరిగే మహోత్పాతాన్ని ఇక ఏ పుణ్యకార్యం ఆపగలదు
గాలిలో కలిసే ప్రాణాలను ఏ మతానికి చెందిన​
దేవుడు రక్షించగలడు
---ఎన్. జయన్న​