25, ఏప్రిల్ 2025, శుక్రవారం
పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి సమీక్ష
నెల్లూరు నుండి వెలువడే లాయర్ వారపత్రికలో నా పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి సమీక్ష.
3, ఏప్రిల్ 2025, గురువారం
వారణాసి నాగేశ్వరాచార్యులు
వారణాసి నాగేశ్వరాచార్యులు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శతక కవి. ఇతను 1962 సంవత్సరంలో జన్మించాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్దకల్ వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సుభద్రమ్మ, వెంకట్రాములు. ప్రస్తుతం గద్వాలలో నివసిస్తున్నారు.
విద్యాభ్యాసం
బాల్యంలో మల్దకల్ లోని కోమటి జయన్న గారి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. అకాడమిక్ చదువు ఏడవ తరగతితోనే ఆగిపోయినా, సాహిత్యం పట్ల, పద్యరచన పట్ల మక్కువతో గద్వాలలోని జయతీర్థాచార్యలు, సీతారామశాస్త్రి, పార్థసారథిశాస్త్రి, వెల్దండ సత్యనారాయణ వంటి పండితుల దగ్గర ఛందస్సు పాఠాలు, పద్యరచన మెలుకువలు నేర్చుకున్నారు. వారి సలహా, సూచనలతో పద్యరచన చేశారు.
రచనలు
పలువురి పండితుల శిష్యరికంచే పలు పద్య మెలకువలు నేర్చుకున్న నాగేశ్వరాచార్యులు ఇప్పటి వరకు 6 శతకాలు రాసి ముద్రించారు.
1. శ్రీ మల్దకల్ తిమ్మప్ప శతకం (2015)
2. శ్రీమల్దకల్ రాయుని శతకం (2017)
3. శ్రీ జోగులాంబ దేవి శతకం (2019 )
4. శ్రీ మెల్దకంటయ్య శతకం (2022)
5. శ్రీ సోమనాద్రి శతకం (2023)
6. శ్రీ జములమ్మ శతకం (2024)
శ్రీ జోగులాంబాదేవి శతకం జూలై 2019 వ సంవత్సరంలో వెలువడింది. కందంలో రాయబడిన ఈ శతకంలో 111 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం - జోగులాంబాదేవి
శ్రీ గణనాథుని మ్రొక్కియు
వేగముగా శారదాంబ వినుతులతోనే
నీగతి శతకము చేయగా
సాగితిని జోగులాంబ సన్నుతి జేయన్ అను పద్యంతో ఈ శతకం ప్రారంభమవుతుంది.
ఇందులో ఒక పద్యం -
నీ దయ శుభంబు గూర్చును
నీ దయ నిత్యము నిల్ప నేర్పరితనమౌను
నీ దయ నాపై చూపవె
యాది పరాశక్తి జోగులాంబా దేవి అని కీర్తిస్తాడు
2022లో వెలువడిన మొల్దకంటయ్య శతకం తేటగీతిలో రాయబడినది. ఈ శతకంలో 113 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం -ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు.
ఇందులో ఒక పద్యం-
సత్యభాషణంబులు నిల్పి సాగునపుడు
భయము లేదు భువిని వైభవంబుగల్గు
పుణ్యకార్యంబు చేయగా బూని నడువ
ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు
సోమనాద్రి శతకం ఆటవెలదిలో రాయబడినది. ఈ శతకంలో 111 పద్యాలున్నాయి. భీమ కదనధీర సోమనాద్రి అనునది మకుటం.
ఇందులో ఒక పద్యం-
రాజరాజులెల్ల రారాజువని నిన్ను
వేగ పొగడి నారు వినుతి జేసి
గద్ద వ్రాలె కోట ఘనత గొప్పననంగ
భీమ కదనధీర సోమనాద్రి
శ్రీ జమ్ములమ్మ శతకం తేటగీతిలో వ్రాయబడిన శతకం. 111 పద్యాలతో కూడిన ఈ శతకంలో శరణు శరణమ్మ మాయమ్మ జమ్ములమ్మ అనునది మకుటం. ఈ శతకాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ కవి ఈ పద్యం చెప్పాడు.
జమ్ములమ్మ పేరున చేసి శతక మిద్ది
పితరులకు నంకితమునిచ్చి ప్రీతితోడ
గురువు మెప్పును బొందితి గొప్పగాను
శరణు శరణమ్మ మాయమ్మ జములమ్మ అంటూ రాసుకు వచ్చారు
ఈ శతకంలోప్రధానంగా జంతుబలిని నిరసించారు.
ఇవేకాక ఇతరుల సంపాదకత్వంలో వెలువడిన పలు సంకలనాలలో కూడా వీరి రచనలు ముద్రితమైనవి.
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి షష్టిపూర్తి సన్మాన సంచిక, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వైభవం కవితా సంకలనం, తెలంగాణ జల కవితోత్సవం, జడకందములు, అక్షరార్చన ద్వానాశాస్త్రి సప్తతి పూర్తి, జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం, ద్వాదశ పుణ్యక్షేత్రాల విశిష్టత, పద్య ప్రభంజనం మొదలగు సంకలనాలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.
మూలాలు
శ్రీ జోగులాంబ దేవి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు, జూలై 2019
శ్రీ మంద కంటయ్య శతకం మల్దకంటయ్య శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీ రామ పబ్లిషర్స్ పాలమూరు జూన్ 2022
శ్రీ సోమనాద్రి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు జనవరి 2023
శ్రీ జమ్ములమ్మ శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు మార్చి 2024
1, ఏప్రిల్ 2025, మంగళవారం
కొత్తకలాలు
కొత్తకలాలు (కవిత్వ సంకలనం) 👈 Download
భాషా బోధన ప్రధానమైన లక్ష్యాలలో సృజనాత్మకత ఒకటి. విదాార్థులలో దాగున్న సృజనాత్మకతని వెలికితీయడం, పిల్లలని సృజనకారులుగా తీర్చిదిద్దడం భాషోపాధ్యాయుల కర్తవ్యం. పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి, పదును పెట్టడానికి ఉపాధ్యాయుడు కూడా సృజనకారుడై ఉండాలి. ఎప్పటికప్పపడు ఉపాధాాయులు తమ సృజనాత్మకతను అభివృద్ది చేసుకోవాలి. అందులో భాగంగానే మా కాంపెాక్స్ భాషోపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు అక్షర రూపాన్నిస్తూ, తొలి ప్రయత్నంగా ఈ కవితల పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత విస్తృతమై, పలు కోణాలలోా ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరిస్తారని, తద్వారా విద్యార్థులను సృజనకారులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను.
-కె. పరమేశ్వర్ రెడ్డి,
కాంపెక్స్ ప్రధానోపాధాాయులు
31, మార్చి 2025, సోమవారం
మూణ్ణెళ్ళ చదువు
ఏటికేడు కంటిచూపు మందగిస్తుంది. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడమో. చేతిలో ఫోన్ చూస్తూ గడపడమో దీనికి కారణమవుతుంది. కంటి చూపు మందగించినప్పుడల్లా కంటిడాక్టర్ని కలవడం, కళ్లద్దాల గాజు మందం సైజు పెంచుకొని కళ్ళకు తగిలించుకోవడం ఇది పరిపాటి అయింది. అందుకని ఈ తతంగం నుంచి కొంతైనా దూరం అవ్వడానికి మళ్లీ పుస్తకాలకు దగ్గర అవడం మేలనిపించింది. అందుకనే ఈ సంవత్సరం - చదవకుండా ఇంట్లో పోగు పడ్డ పుస్తకాలలో కొన్నైనా చదివేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా గడిచిన మూడు నెలల్లో కింద కనబరిచిన పుస్తకాలని చదివేశాను. ఇందులో చదువమని తమ రచనల్ని కానుకగా ఇచ్చిన రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇష్టంతో కొని తెచ్చుకున్న పుస్తకాలు ఉన్నాయి. అవే ఈ జాబితా...
జనవరి , 2025
1.టిట్ బిట్ (నవల)- రిషిత
2. పెందోట వైభవం (శతక సాహిత్యం, మరికొన్ని పద్యరచనలు) - సం. డాక్టర్ నాగేశ్వరాచారి
3. గుల్మొహర్ (అనువాద కవిత్వం)- వెన్నెల సత్యం
4. వెన్నెలమ్మ శతకం (శతకం) - వెన్నెల సత్యం
5. సితపుష్ప మాల (ముత్యాల సరాలు) రంగినేని సుబ్రహ్మణ్యం
6. వెన్నెల మణిపూసలు (మణిపూసలు)- వెన్నెల సత్యం
7. వెన్నెల తొడిగిన రెక్కలు (రెక్కలు)- వెన్నెల సత్యం
ఫిబ్రవరి 2025
1. నాన్న నానీలు (నానీలు)- వెన్నెల సత్యం
2. అమ్మ నానీలు (నానీలు) - వెన్నెల సత్యం
3. సోమనాద్రి శతకం (శతకం)- వారణాసి నాగేశ్వరాచార్యులు
4. ముక్తి పథం (శతకం)- ఊర ఈశ్వర్ రెడ్డి
5. సుందర రామ శతకం (శతకం) -మేడిచర్ల హరి నాగభూషణం
మార్చి 2025
1. ఆరె కటిక మొగ్గలు (మొగ్గలు)- మంగళగిరి శ్రీనివాసులు
2. జమ్ములమ్మ శతకం (శతకం) - మేడిచర్ల హరినాగ భూషణం
4. బతుకు చెట్టు (వచన కవిత్వం)- వెన్నెల సత్యం
5. స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవహారతి (పద్య కావ్యం)- సం. కోడిహళ్లీ మురళీమోహన్
6. వీరనాగ శతకం (శతకం)- చిక్కొండ్ర రవి
7. దృశ్యాంతరం (సాహిత్య విమర్శావ్యాసాలు)- డాక్టర్ కే నాగేశ్వరాచారి
21, మార్చి 2025, శుక్రవారం
18, మార్చి 2025, మంగళవారం
స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి
స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని
పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ
శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ
హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ
పుస్తకం సంపాదకులు. ఈ పుస్తకం
ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది. వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే
ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే. ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ
రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా
వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే. శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే
ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే. ముక్తపదగ్రస్త
విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని
మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది. అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం
అన్నమాట. సంపాదకులు గ్రంథాన్నే
ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి
అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు
దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక
పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ.
పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.
ఈ పుస్తకం గురించి
సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో
పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని
భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో
ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా
ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.
ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256
15, మార్చి 2025, శనివారం
ఊర ఈశ్వర్ రెడ్డి
ఊర ఈశ్వర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పద్య కవి. పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలంలోని కోవెలదిన్నె గ్రామంలో జన్మించారు. 1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి. వీరి భార్య ఊర ఈశ్వరమ్మ. స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు ప్రాథమిక విద్యను అభ్యసించారు. సమీపంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి.
రచనలు
1.వెంకటేశ్వర దిశతి
2.చెన్నకేశవ శతకం
3.కవితాలహరి
4. సమస్యా పూరణం
5.ముక్తిపథం
6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి చరిత్ర
7. పెద్దదిన్నె శ్రీవెంకటేశ్వరస్వామి చరిత్ర
2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం-
శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా
తిరుమలగిరి పైన తిరముగాను
వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి
విశ్వమందు నిజము వేంకటేశ
2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.
జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక, శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.



