18, మార్చి 2025, మంగళవారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 


స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ పుస్తకం సంపాదకులు.  ఈ పుస్తకం ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది.  వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే.  ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే.  శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే.    ముక్తపదగ్రస్త విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది.  అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం అన్నమాట.  సంపాదకులు గ్రంథాన్నే ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను  కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం  ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ. పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.

ఈ పుస్తకం  గురించి సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో  ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.

 

ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి