31, ఆగస్టు 2014, ఆదివారం

అంకాళమ్మ కోట



అంకాళమ్మ కోట  మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే  కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ మీద 20 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు. ప్రస్తుతం కోట శిథిలావస్థలో ఉన్నా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటంతో పర్యాటకులకు కనువిందు చేస్తూ అలరారుతూ ఉంది.
ఉనికి
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున అంకాళమ్మ కోట ఉంది. ఈ భూభాగం కర్నూలు జిల్లా లోని ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఉంది.
కోట కాలం
ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.
కోటలోని నిర్మాణాలు
ఈ కోటలో కాళికాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం, పురాతన బావి ఉన్నాయి. ఇక్కడి కాళికాదేవికి అంకాళమ్మ అని పేరు. ఆమె పేరు మీదుగానే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది. పేరు భయం కొల్పే విధంగా ఉండినా, అమ్మ వారు మాత్రం ప్రశాంత వదనంతో ఉంటుందంటారు. కోట జన బాహుళ్యంలోకి రాని నాడు, గుప్త నిధుల కొరకు కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేస్తే, జాలరులు, అక్కడి చెంచులు, మరికొందరు భక్తులు విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఇక్కడ అమ్మవారి పూజారులు కూడా చెంచులే.
ప్రయాణ మార్గం
అంకాళమ్మ కోటకు చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జల మార్గం, మరొకటి రోడ్డు మార్గం. జల మార్గం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా వాసులు, రోడ్డు మార్గం ద్వారా కర్నూలు జిల్లా వాసులు ఈ కోటకు వస్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటకులు, భక్తులు కొల్లాపూర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్యన ఉన్న అమరగిరి గ్రామానికి చేరుకొని, అక్కడి నుండి కృష్ణానదిలో 8 కిలోమీటర్లు పుట్టీలలో, మోటార్ బోటులలో ప్రయాణించి అంకాళమ్మ కోటకు చేరుకుంటారు. కర్నూలు జిల్లా వాసులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతం వరకు లారీలు, ట్రాక్టర్లలో వచ్చి, అక్కడి నుండి కాలినడకన కోటకు చేరుకుంటారు.
ప్రత్యేక పూజలు
ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అందుకే ఆ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక దినాలలో కూడా భక్తులు బంధుమిత్రులతో వచ్చి జంతు బలిలు ఇచ్చి, అమ్మ వారికి పూజలు చేస్తుంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి