3, ఏప్రిల్ 2025, గురువారం

వారణాసి నాగేశ్వరాచార్యులు

    వారణాసి నాగేశ్వరాచార్యులు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శతక కవి. ఇతను 1962 సంవత్సరంలో జన్మించాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్దకల్ వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సుభద్రమ్మ, వెంకట్రాములు. ప్రస్తుతం గద్వాలలో నివసిస్తున్నారు. 

విద్యాభ్యాసం

బాల్యంలో మల్దకల్ లోని కోమటి జయన్న గారి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.   మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. అకాడమిక్ చదువు ఏడవ తరగతితోనే ఆగిపోయినా, సాహిత్యం పట్ల, పద్యరచన పట్ల మక్కువతో గద్వాలలోని జయతీర్థాచార్యలు, సీతారామశాస్త్రి, పార్థసారథిశాస్త్రి, వెల్దండ సత్యనారాయణ వంటి పండితుల దగ్గర ఛందస్సు పాఠాలు, పద్యరచన మెలుకువలు నేర్చుకున్నారు. వారి సలహా, సూచనలతో పద్యరచన చేశారు. 

రచనలు 

పలువురి పండితుల శిష్యరికంచే పలు పద్య మెలకువలు నేర్చుకున్న నాగేశ్వరాచార్యులు ఇప్పటి వరకు 6  శతకాలు రాసి ముద్రించారు.


1. శ్రీ మల్దకల్  తిమ్మప్ప శతకం (2015)

2. శ్రీమల్దకల్ రాయుని శతకం (2017) 

3. శ్రీ  జోగులాంబ దేవి శతకం (2019 )

4. శ్రీ మెల్దకంటయ్య శతకం (2022) 

5. శ్రీ సోమనాద్రి శతకం (2023)

6. శ్రీ జములమ్మ శతకం (2024) 


శ్రీ జోగులాంబాదేవి శతకం జూలై 2019 వ సంవత్సరంలో వెలువడింది. కందంలో రాయబడిన ఈ శతకంలో 111 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం - జోగులాంబాదేవి 

శ్రీ గణనాథుని మ్రొక్కియు

వేగముగా శారదాంబ వినుతులతోనే 

నీగతి శతకము చేయగా

సాగితిని జోగులాంబ సన్నుతి జేయన్  అను పద్యంతో ఈ శతకం ప్రారంభమవుతుంది.

ఇందులో ఒక పద్యం -

 నీ దయ శుభంబు గూర్చును 

నీ దయ నిత్యము నిల్ప నేర్పరితనమౌను 

నీ దయ నాపై చూపవె 

యాది పరాశక్తి జోగులాంబా దేవి  అని కీర్తిస్తాడు

2022లో వెలువడిన మొల్దకంటయ్య శతకం తేటగీతిలో రాయబడినది. ఈ శతకంలో 113 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం -ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు. 


ఇందులో ఒక పద్యం-

సత్యభాషణంబులు నిల్పి సాగునపుడు

 భయము లేదు భువిని వైభవంబుగల్గు

 పుణ్యకార్యంబు చేయగా బూని నడువ

ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు 

సోమనాద్రి శతకం ఆటవెలదిలో రాయబడినది.   ఈ శతకంలో 111 పద్యాలున్నాయి. భీమ కదనధీర సోమనాద్రి అనునది మకుటం. 

ఇందులో ఒక పద్యం- 

 రాజరాజులెల్ల  రారాజువని నిన్ను 

వేగ పొగడి నారు వినుతి జేసి

గద్ద వ్రాలె కోట ఘనత గొప్పననంగ

 భీమ కదనధీర సోమనాద్రి 


శ్రీ జమ్ములమ్మ శతకం తేటగీతిలో వ్రాయబడిన శతకం. 111 పద్యాలతో కూడిన ఈ శతకంలో శరణు శరణమ్మ మాయమ్మ జమ్ములమ్మ అనునది మకుటం.  ఈ శతకాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ కవి ఈ పద్యం చెప్పాడు.

జమ్ములమ్మ పేరున చేసి శతక మిద్ది

 పితరులకు నంకితమునిచ్చి ప్రీతితోడ

 గురువు మెప్పును బొందితి  గొప్పగాను

 శరణు శరణమ్మ మాయమ్మ జములమ్మ అంటూ రాసుకు వచ్చారు

ఈ శతకంలోప్రధానంగా  జంతుబలిని నిరసించారు. 


ఇవేకాక ఇతరుల సంపాదకత్వంలో వెలువడిన పలు సంకలనాలలో కూడా  వీరి రచనలు ముద్రితమైనవి.

శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి షష్టిపూర్తి సన్మాన సంచిక, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వైభవం కవితా సంకలనం, తెలంగాణ జల కవితోత్సవం, జడకందములు, అక్షరార్చన ద్వానాశాస్త్రి సప్తతి పూర్తి, జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం, ద్వాదశ పుణ్యక్షేత్రాల విశిష్టత, పద్య ప్రభంజనం  మొదలగు సంకలనాలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.

మూలాలు 

శ్రీ జోగులాంబ దేవి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు, జూలై 2019 

శ్రీ మంద కంటయ్య శతకం మల్దకంటయ్య శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీ రామ పబ్లిషర్స్ పాలమూరు జూన్ 2022 

శ్రీ సోమనాద్రి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు జనవరి 2023 

శ్రీ జమ్ములమ్మ శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు మార్చి 2024

1, ఏప్రిల్ 2025, మంగళవారం

కొత్తకలాలు

కొత్తకలాలు (కవిత్వ సంకలనం) 👈 Download


 భాషా బోధన ప్రధానమైన లక్ష్యాలలో సృజనాత్మకత ఒకటి. విదాార్థులలో దాగున్న సృజనాత్మకతని వెలికితీయడం, పిల్లలని సృజనకారులుగా తీర్చిదిద్దడం భాషోపాధ్యాయుల కర్తవ్యం. పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి, పదును పెట్టడానికి ఉపాధ్యాయుడు కూడా సృజనకారుడై ఉండాలి. ఎప్పటికప్పపడు ఉపాధాాయులు తమ సృజనాత్మకతను అభివృద్ది చేసుకోవాలి. అందులో భాగంగానే మా కాంపెాక్స్ భాషోపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు  అక్షర రూపాన్నిస్తూ,  తొలి ప్రయత్నంగా ఈ కవితల  పుస్తకాన్ని  తీసుకువస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత విస్తృతమై, పలు కోణాలలోా ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను  వ్యక్తీకరిస్తారని, తద్వారా విద్యార్థులను  సృజనకారులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను. 

 -కె. పరమేశ్వర్ రెడ్డి,

   కాంపెక్స్ ప్రధానోపాధాాయులు 

31, మార్చి 2025, సోమవారం

మూణ్ణెళ్ళ చదువు

      ఏటికేడు కంటిచూపు మందగిస్తుంది.  గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడమో.  చేతిలో ఫోన్ చూస్తూ గడపడమో దీనికి కారణమవుతుంది. కంటి చూపు మందగించినప్పుడల్లా  కంటిడాక్టర్ని కలవడం, కళ్లద్దాల గాజు మందం సైజు పెంచుకొని కళ్ళకు తగిలించుకోవడం ఇది పరిపాటి అయింది. అందుకని ఈ తతంగం నుంచి కొంతైనా దూరం అవ్వడానికి మళ్లీ పుస్తకాలకు దగ్గర అవడం మేలనిపించింది.  అందుకనే ఈ సంవత్సరం - చదవకుండా ఇంట్లో పోగు పడ్డ పుస్తకాలలో కొన్నైనా చదివేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా గడిచిన మూడు నెలల్లో  కింద కనబరిచిన  పుస్తకాలని చదివేశాను.  ఇందులో చదువమని తమ రచనల్ని కానుకగా ఇచ్చిన రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇష్టంతో కొని తెచ్చుకున్న పుస్తకాలు ఉన్నాయి. అవే ఈ జాబితా...

జనవరి , 2025 

1.టిట్ బిట్ (నవల)- రిషిత

2. పెందోట వైభవం (శతక సాహిత్యం, మరికొన్ని పద్యరచనలు) - సం. డాక్టర్ నాగేశ్వరాచారి

3. గుల్మొహర్ (అనువాద కవిత్వం)- వెన్నెల సత్యం

4. వెన్నెలమ్మ శతకం (శతకం) - వెన్నెల సత్యం 

5. సితపుష్ప మాల (ముత్యాల సరాలు) రంగినేని సుబ్రహ్మణ్యం

6. వెన్నెల మణిపూసలు (మణిపూసలు)- వెన్నెల సత్యం 

7. వెన్నెల తొడిగిన రెక్కలు (రెక్కలు)- వెన్నెల సత్యం 

ఫిబ్రవరి 2025

1. నాన్న నానీలు (నానీలు)- వెన్నెల సత్యం 

2. అమ్మ నానీలు (నానీలు) - వెన్నెల సత్యం 

3. సోమనాద్రి శతకం (శతకం)- వారణాసి నాగేశ్వరాచార్యులు

4. ముక్తి పథం (శతకం)- ఊర  ఈశ్వర్ రెడ్డి

5. సుందర రామ శతకం (శతకం) -మేడిచర్ల హరి నాగభూషణం 

మార్చి 2025 

1. ఆరె కటిక మొగ్గలు (మొగ్గలు)- మంగళగిరి శ్రీనివాసులు

2. జమ్ములమ్మ శతకం (శతకం) - మేడిచర్ల హరినాగ భూషణం 

4. బతుకు చెట్టు (వచన కవిత్వం)- వెన్నెల సత్యం

5. స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవహారతి (పద్య కావ్యం)- సం. కోడిహళ్లీ మురళీమోహన్

6. వీరనాగ శతకం (శతకం)- చిక్కొండ్ర రవి 

7. దృశ్యాంతరం (సాహిత్య విమర్శావ్యాసాలు)- డాక్టర్ కే నాగేశ్వరాచారి

18, మార్చి 2025, మంగళవారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 


స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ పుస్తకం సంపాదకులు.  ఈ పుస్తకం ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది.  వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే.  ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే.  శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే.    ముక్తపదగ్రస్త విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది.  అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం అన్నమాట.  సంపాదకులు గ్రంథాన్నే ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను  కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం  ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ. పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.

ఈ పుస్తకం  గురించి సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో  ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.

 

ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256

15, మార్చి 2025, శనివారం

ఊర ఈశ్వర్ రెడ్డి

 


ఊర ఈశ్వర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పద్య కవి.  పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలంలోని కోవెలదిన్నె గ్రామంలో జన్మించారు.  1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి.  వీరి భార్య ఊర ఈశ్వరమ్మ.  స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు  ప్రాథమిక విద్యను అభ్యసించారు.  సమీపంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు.  ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు.  సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి. 

 రచనలు 

1.వెంకటేశ్వర దిశతి 

2.చెన్నకేశవ శతకం 

3.కవితాలహరి

4. సమస్యా పూరణం 

5.ముక్తిపథం 

6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి

2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ  అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం- 

శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా 

తిరుమలగిరి పైన తిరముగాను

వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి

 విశ్వమందు నిజము వేంకటేశ

2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.

జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక,  శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

26, ఫిబ్రవరి 2025, బుధవారం

డా. ఎస్. జి. రామానుజాచార్యులు


 డా. ఎస్. జి. రామానుజాచార్యులు తెలుగుకవి, రచయిత. హైదరాబాద్ వాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ ఫ్యాకల్టీకి పీఠాధిపతిగా పనిచేశాడు. జూన్ 15, 1944 వ తేదిన హైదరాబాద్లో  జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఆండాళమ్మ, ఎస్. జి. నరసింహాచార్యులు. ఇతని పూర్వికులు నల్లగొండ జిల్లా ,సూర్యాపేట సమీపంలోని మంగలపల్లి గ్రామానికి చెందినవారు. 1977లో వీరు ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర అను అంశంపై పరిశోధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు.

విద్యాభ్యాసం 

శ్రీవెంకటేశ్వర వేందాంత వర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదులో బి.ఓ.ఎల్., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.,(తెలుగు), పి.హెచ్డీ. చేశారు.

ఉద్యోగం 

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గవర్నమెంట్ ఆంధ్ర ఓరియంటల్ కాలేజీ, హైదరాబాద్, తెలుగు శాఖ పీజీ విభాగంలో వీరు ఉపన్యాసకులుగా, రీడర్గా, ప్రధాన ఆచార్యులుగా వివిధ హోదాలలో 33 సంవత్సరాలు పనిచేశారు. 1995 నుంచి 1998 వరకు ఓరియంటల్ ఫ్యాకల్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు.  2001 జూలై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ ఫ్యాకల్టీకి డీన్ గాను పనిచేశారు. 1984లో వీరి సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రధానంతో సత్కరించింది. అవార్డును నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు.

రచనలు 

1.ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర

2. మాయా మానవుని చైతన్య కిరణాలు

3.దండి దశకుమార చరిత్ర(ఆంధ్రానువాదం)

4. గాలిబ్ కవితాశిల్పం (సాహిత్యవిమర్శనా గ్రంథం)

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రచురణలు తెలుగు కవితా సౌరభాలు, తెలుగు సాహితీ స్రవంతి వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సాహితీ సేవలో అంతర్భాగంగా వీరు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం నేతృత్వంలో సాగిన ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం- ఒకటి, రెండు, మూడు సంపుటాలలో 38 సాహితీ, చారిత్రక వ్యాసాలను రచించారు. కళాశాల ప్రచురణ- నన్నయ్య ప్రసన్న కథ లోతులు గ్రంథానికి సంపాదకత్వం వహించారు. 





17, ఫిబ్రవరి 2025, సోమవారం

2001-02 విద్యార్థులతో...


 

శ్రీసరస్వతీ విద్యామందిరం, గద్వాలలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టినప్పుడు...వీళ్లు నా మొదటి 10 వ తరగతి బ్యాచ్.

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఆంధ్రజ్యోతిలో దృక్కోణం

 



తమ బుక్ షెల్పులో చోటిచ్చినందుకు ఆదివారం ఆంధ్రజ్యోతికి, గొరుసు జగదీశ్వర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు

22, జనవరి 2025, బుధవారం

వెన్నెల సత్యం -‘గుల్ మొహర్’

 


గుల్ మొహర్  అందమైన పూల చెట్టు. మా ప్రాంతంలో (జోగులాంబ గద్వాల జిల్లా) అయితే దీనిని సుంకేసుల చెట్టు అంటాం. ఆయా ప్రాంతాల్లో ఇంకా భిన్నమైన పేర్లు కూడా ఉండవచ్చు.  ఒకప్పుడు ఈ చెట్టు లేని బడి, కాలేజీ ఉండేది కాదు. ఇప్పుడైతే అక్కడక్కడ రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. అవి పూసే కాలంలో రోడ్లకు ఎంత అందమో వర్ణించలేం. గొప్ప అందాన్ని ఇచ్చే ఈ పూలకు అంతే పరిమళం ఉందో లేదో చెప్పలేను. కానీ ఆ పేరుతో వచ్చిన ఈ పుస్తకం నిండా కవిత్వ పరిమళమే. గుల్జార్ కవిత్వ పరిమళమే.

    హిందీ సినిమాలతోనూ, హిందీ సాహిత్యంతోనూ, అనువాద సాహిత్యంతోనూ పరిచయం ఉన్నవారికి గుల్జార్ తెలిసి ఉండవచ్చు.  కానీ నాలాంటి సాధారణ తెలుగు పాఠకుడికి సైతం గుల్జార్ను చేరువ చేసిన ఘనత మాత్రం వెన్నెల సత్యం గారిదే.  గుల్జార్ కవిత్వాన్ని స్వేచ్ఛనువాదం చేస్తూ,  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చిన సత్యం గారు వాటన్నిటిని కలిపి ఇప్పుడు గుల్ మొహర్ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.

    పాద, గణ, మాత్ర నియమాలు అంటూ ఏమీలేని ఈ మినీ కవితల్లో ఎక్కువ భాగం నానీల లాగే నాలుగు పాదాల్లో నడిచాయి. వీటిని కవి గుల్ మొహర్ లని పిలిచాడు.   ఒక్కో గుల్ మొహర్  కవిత్వ పరిమళాన్ని వెదజల్లే ఒక్కో గుల్ మొహర్ పువ్వే. మచ్చుకు ఈ పుస్తకంలోని మొదటి గుల్ మొహర్ ను చూడండి-

ముళ్ళను ఎందుకు

నిందిస్తావు మిత్రమా

నీ పాదాలే వాటిపై ఉంచావు

అవి వాటి చోటనే ఉన్నాయి

 

 లోకంలో ఎవరికి లేనన్ని కష్టాలు నాకే ఎదురవుతున్నాయి. నాకే ఎందుకిన్నీ కష్టాలని  వాపోతామే కానీ,  మన ఏ చేతల వలన, ఏ అచేతనం వలన కష్టాలు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకోం.   దాన్ని గుర్తుచేసే గుల్ మొహరే కదా ఇది. 

మరోకటి-

కప్పు టీ తోపాటు

పాత కథల్ని పంచుకుంటున్నారు

 టీ చల్లారిపోయింది

 కళ్ళు తడిగా మారాయి

ఈ గుల్ మొహర్ లో మనల్ని మనం చూసుకోలేమా! మన జీవితం అద్దంలో దర్శనం ఇచ్చినట్లుగా అనిపించదా! ఇట్లా ఎన్ని కథలని, టీలతో కలిపి, మిత్రులతో పంచుకుని కన్నీళ్ళతో తడిసిపోయిన జ్ఞాపకాలు మనకు లేవా! ఈ విధంగా ఈ పుస్తకం నిండా నేను, మీరు, మనం, మన అనుభవాలు కనిపిస్తాయి.  ఇందులో నిజాలు, నిష్టూరాలు, జీవిత అనుభవాలు, జీవిత పాఠాలు, పగిలిన హృదయాలు అన్నీ మనకు దర్శనమిస్తాయి. ఇది చదవదగిన పుస్తకం. గుల్జార్ కవిత్వాన్ని తెలుగు వాళ్లకు అందించిన వారి సరసన నిలిచినందుకు, మంచి కవిత్వాన్ని అందించినందుకు వెన్నెల సత్యం గారిని అభినందించాల్సిందే!