6, సెప్టెంబర్ 2014, శనివారం

పానగల్‌ కోట

పానగల్‌ కోట మహబూబ్ నగర్ జిల్లాలోని గిరి దుర్గాలలో ప్రముఖమైనది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రమైన పానగల్ సమీపంలో ఈ కోట ఉంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి, ఈ ప్రాంత ప్రజల సామరస్యానికి ప్రతీకగా నిలిచే అనేక నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. కోటలో  తటాకాలు, ఉయ్యాల మండపం మొదలగు నిర్మాణాలు కనిపిస్తాయి, కోట లోపల అనేక నిర్మాణాలలో శిల్పకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఈ ప్రాంతపు జానపదుల అనేక కథలలోనూ ఈ కోట ప్రస్తావన ఉంది. కోటలోని పరివారానికి నాడు ఆహారం కొరకు రకరకాల పళ్ళ చెట్లు కూడా కోటలో పెంచేవారని తెలుస్తుంది. కోటకు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించకపోయినా, తరుచుగా సందర్శకులు ఇక్కడి వస్తూనే ఉన్నారు. గుప్త నిధుల వేటగాళ్ళ బారినపడి ఇక్కడి అపురూపమైన ప్రాచీన సంస్కృతిక కట్టడాలు నేలమట్టమైపోతున్నాయి. విగ్రహాలు ధ్వంసమైపోతున్నాయి. ఈ ప్రాంతంలో లభించిన అనేక శాసనాలను, ఫిరంగులను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు.
ఉనికి
వనపర్తి నుండి కొల్లాపూర్‌కు వెళ్ళేదారిలో వనపర్తికి 14 కిలోమీటర్ల దూరంలో పానగల్ సమీపంలో ఈ కోట కనిపిస్తుంది,
కోట నిర్మాణం
ఈ కోటను ఎత్తైన దుర్గం మీద నిర్మించారు. ఈ పర్వతశ్రేణి మూడు వైపుల గుర్రం నాడా ఆకారంలో ఉండి, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగి ఉంది. కొండపై  20 అడుగుల ఎత్తున ప్రాకారాలను నిర్మించారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో కోటను నిర్మించారు. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ కోటను నిర్మించారు. ఇది 11 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యుల సామంతులచే నిర్మింపబడినదని అంటారు. శత్రు దుర్బేధ్యమైన ఈ కోటలో 60 దాకా బురుజులు ఉన్నాయి. ఎత్తైన ఈ దుర్గం మీద విశాలమైన పల్లం కలిగి అందులో బావులు, గుడులు, గోపురాలు, మసీదులు ఉన్నాయి. కోట తూర్పు భాగంలో నాలుగు ప్రాకారాలు, వాటిపై ఫిరంగుల స్థావరాలు, సైన్యానికి ఏర్పాటుచేసిన విడిది శాలలు కనిపిస్తాయి.
 సప్త ప్రాకారాలు
చాలా విశాలమైన ఈ కోటలోకి ప్రవేశించడానికి  సప్త ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది.  వీటిలో చాలా వరకు నేడు శిథిలమై ఉన్నాయి. కాని ప్రధాన ప్రాకార ద్వారం మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ ద్వారానికి ''ముండ్లగౌని '' ద్వారమని పేరు. ఈ ద్వారంపై ఉన్న కళానైపుణ్యం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. ద్వారం తలుపులపై బంగారం, పంచలోహాలతో చేసిన చెక్కడాలు, తాపడాలు ఉండేవట. వాటిని గుప్తనిధుల వేటగాళ్ళ దొంగిలించారట. 
రామ గుండం
ఈ కోటలో ఒకే రాతిపై పెద్ద నడబావిని తవ్వించి దానికి రామ గుండం అని పేరు పెట్టారు. నాడు రామగుండంలోని నీటిని తోడి పల్లపు ప్రాంతంలో ఉన్న భూములకు పారించి, పంటలు పండించేవారట. ఇప్పటికీ బావికి రెండువైపులా పెద్ద మోట, చిన్న మోట అనే కట్టడాలు కనిపిస్తాయి.
సీతారాముల పాదాలు
రామ గుండం రాతిపై దక్షిణం వైపు  పాదముద్రలు ఉన్నాయి. వీటికి సీతారాముల పాదముద్రలని పేరు. అందుకే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నేటికీ హైందవ పర్వదినాలైన తొలి ఏకాదశి, శివరాత్రి, శ్రీరామ నవమి మొదలగు రోజుల్లో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి, రామగుండంలో స్నానాలు చేసి, సీతారాముల పాదాలకు పూజలు నిర్వహిస్తుంటారు.
శాసనాలు
ఈ కోటలో చాలా శాసనాలు లభించాయి. ఒకటి తెలుగు, కన్నడ మిశ్రమలిపిలో రాయబడిన శాసనం లభించింది. కాని ఇది శిథిలమైనందున, అందులోని విషయం పూర్తిగా తెలిసిరాలేదు. కోటలో గణపతి గుండు అను పాశానంపై మరో శాసనం ఉంది. దీనికి ''ఖైరాత్‌ఖాన్‌ శాసనం'' అని పేరు. ఇది తెలుగు, కన్నడ, అరబిక్ భాషలలో మిశ్రమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాసనాలను చిన్న మంత్రి అనే శాసన రచయిత చెక్కినట్లు తెలుస్తుంది.
మక్కా మసీదు
కోటలో మక్కా మసీదు పేరుతో నిర్మించిన ప్రార్థనామందిరం ఉంది. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మసీదుపై ఉన్న మినారులను మాత్రం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ మసీదు ముందు ప్రధాన ద్వారానికి రెండువైపుల రాతి సింహాలు ఉన్నాయి. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఉయ్యా;ల మండపం
కోటలో నాటి రాజులు విరామ సమయాలు గడపడానికి, సరదాగా ఊగడానికి ఒక పెద్ద ఊయలను, దానికో ఆరామాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దీనికి ఉయ్యాల మండపం అని పేరు. 
దుర్గంలో దర్గాలు
హజ్రత్ అగా దావుద్ దర్గా ఉంది. ఇక్కడికి హిందూ, ముస్లిం భక్తులు విరివిగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దుర్గం దిగువ భాగంలోనూ ప్రసిద్ధ బార్లాపీర్ల దర్గా ఉంది. హిందూ ముస్లింల సమైక్యతకు ఈ దర్గాలు ఈ ప్రాంతంలో ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

2 కామెంట్‌లు:

  1. పానగల్ కోట ప్రసిద్ధమైనదే.మీరు దానిపై వ్యాఖ్య తో బాటు మంచి ఫొటోలు కూడా జతచేసి ఉంటే చాలా బాగుండేది.

    రిప్లయితొలగించండి