1, ఏప్రిల్ 2025, మంగళవారం

కొత్తకలాలు

కొత్తకలాలు (కవిత్వ సంకలనం) 👈 Download


 భాషా బోధన ప్రధానమైన లక్ష్యాలలో సృజనాత్మకత ఒకటి. విదాార్థులలో దాగున్న సృజనాత్మకతని వెలికితీయడం, పిల్లలని సృజనకారులుగా తీర్చిదిద్దడం భాషోపాధ్యాయుల కర్తవ్యం. పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి, పదును పెట్టడానికి ఉపాధ్యాయుడు కూడా సృజనకారుడై ఉండాలి. ఎప్పటికప్పపడు ఉపాధాాయులు తమ సృజనాత్మకతను అభివృద్ది చేసుకోవాలి. అందులో భాగంగానే మా కాంపెాక్స్ భాషోపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు  అక్షర రూపాన్నిస్తూ,  తొలి ప్రయత్నంగా ఈ కవితల  పుస్తకాన్ని  తీసుకువస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత విస్తృతమై, పలు కోణాలలోా ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను  వ్యక్తీకరిస్తారని, తద్వారా విద్యార్థులను  సృజనకారులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను. 

 -కె. పరమేశ్వర్ రెడ్డి,

   కాంపెక్స్ ప్రధానోపాధాాయులు 

31, మార్చి 2025, సోమవారం

మూణ్ణెళ్ళ చదువు

      ఏటికేడు కంటిచూపు మందగిస్తుంది.  గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడమో.  చేతిలో ఫోన్ చూస్తూ గడపడమో దీనికి కారణమవుతుంది. కంటి చూపు మందగించినప్పుడల్లా  కంటిడాక్టర్ని కలవడం, కళ్లద్దాల గాజు మందం సైజు పెంచుకొని కళ్ళకు తగిలించుకోవడం ఇది పరిపాటి అయింది. అందుకని ఈ తతంగం నుంచి కొంతైనా దూరం అవ్వడానికి మళ్లీ పుస్తకాలకు దగ్గర అవడం మేలనిపించింది.  అందుకనే ఈ సంవత్సరం - చదవకుండా ఇంట్లో పోగు పడ్డ పుస్తకాలలో కొన్నైనా చదివేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా గడిచిన మూడు నెలల్లో  కింద కనబరిచిన  పుస్తకాలని చదివేశాను.  ఇందులో చదువమని తమ రచనల్ని కానుకగా ఇచ్చిన రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇష్టంతో కొని తెచ్చుకున్న పుస్తకాలు ఉన్నాయి. అవే ఈ జాబితా...

జనవరి , 2025 

1.టిట్ బిట్ (నవల)- రిషిత

2. పెందోట వైభవం (శతక సాహిత్యం, మరికొన్ని పద్యరచనలు) - సం. డాక్టర్ నాగేశ్వరాచారి

3. గుల్మొహర్ (అనువాద కవిత్వం)- వెన్నెల సత్యం

4. వెన్నెలమ్మ శతకం (శతకం) - వెన్నెల సత్యం 

5. సితపుష్ప మాల (ముత్యాల సరాలు) రంగినేని సుబ్రహ్మణ్యం

6. వెన్నెల మణిపూసలు (మణిపూసలు)- వెన్నెల సత్యం 

7. వెన్నెల తొడిగిన రెక్కలు (రెక్కలు)- వెన్నెల సత్యం 

ఫిబ్రవరి 2025

1. నాన్న నానీలు (నానీలు)- వెన్నెల సత్యం 

2. అమ్మ నానీలు (నానీలు) - వెన్నెల సత్యం 

3. సోమనాద్రి శతకం (శతకం)- వారణాసి నాగేశ్వరాచార్యులు

4. ముక్తి పథం (శతకం)- ఊర  ఈశ్వర్ రెడ్డి

5. సుందర రామ శతకం (శతకం) -మేడిచర్ల హరి నాగభూషణం 

మార్చి 2025 

1. ఆరె కటిక మొగ్గలు (మొగ్గలు)- మంగళగిరి శ్రీనివాసులు

2. జమ్ములమ్మ శతకం (శతకం) - మేడిచర్ల హరినాగ భూషణం 

4. బతుకు చెట్టు (వచన కవిత్వం)- వెన్నెల సత్యం

5. స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవహారతి (పద్య కావ్యం)- సం. కోడిహళ్లీ మురళీమోహన్

6. వీరనాగ శతకం (శతకం)- చిక్కొండ్ర రవి 

7. దృశ్యాంతరం (సాహిత్య విమర్శావ్యాసాలు)- డాక్టర్ కే నాగేశ్వరాచారి

18, మార్చి 2025, మంగళవారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 


స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ పుస్తకం సంపాదకులు.  ఈ పుస్తకం ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది.  వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే.  ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే.  శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే.    ముక్తపదగ్రస్త విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది.  అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం అన్నమాట.  సంపాదకులు గ్రంథాన్నే ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను  కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం  ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ. పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.

ఈ పుస్తకం  గురించి సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో  ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.

 

ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256

15, మార్చి 2025, శనివారం

ఊర ఈశ్వర్ రెడ్డి

 


ఊర ఈశ్వర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పద్య కవి.  పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలంలోని కోవెలదిన్నె గ్రామంలో జన్మించారు.  1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి.  వీరి భార్య ఊర ఈశ్వరమ్మ.  స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు  ప్రాథమిక విద్యను అభ్యసించారు.  సమీపంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు.  ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు.  సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి. 

 రచనలు 

1.వెంకటేశ్వర దిశతి 

2.చెన్నకేశవ శతకం 

3.కవితాలహరి

4. సమస్యా పూరణం 

5.ముక్తిపథం 

6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి

2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ  అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం- 

శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా 

తిరుమలగిరి పైన తిరముగాను

వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి

 విశ్వమందు నిజము వేంకటేశ

2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.

జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక,  శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.